Telangana | వనపర్తి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రైతన్నలకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. వ్యవసాయాన్ని నిలుపుకోవడానికి బావుల బాట పట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించని ఈ ఒరవడి ఇప్పుడు గ్రామాల్లో విరివిగా కనిపిస్తున్నది. ఇంతకాలానికి మళ్లీ రైతులు వ్యవసాయ బావుల తవ్వకాలు చేపట్టడానికి కారణం.. ఈ ఏడాది తీవ్రంగా నీటి గోస తలెత్తడమే. వనపర్తి జిల్లాలో రైతన్నలు బావులు తవ్వుకుంటున్నారు. ఈ ఏడాది తీవ్ర నీటిఎద్దడిని చూసి భయంతో మళ్లీ బావుల తవ్వకానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో వరుసగా కాల్వలో నీళ్లను చూసిన రైతులకు ఈసారి కాల్వల్లో నీళ్లు అంతంత మాత్రమే వచ్చాయి. పుష్కలంగా రెండు పంటలను పండించిన పరిస్థితి నుంచి మళ్లీ ఎన్కటి రోజులను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. నీటి గోస నుంచి బయట పడేందుకు జిల్లాలో పాత బావుల్లో పూడికతీత పనులకు రైతులు మొగ్గు చూపారు. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో దాదాపు వెయ్యి పాత బావుల్లో పూడిక పనులను చేపట్టినట్టు సమాచారం.
వనపర్తి జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే దాదాపు 200కుపైగా కొత్త బావులను రైతులు తవ్వించుకున్నారు. జేసీబీ, హిటాచీల ద్వారానే పనులు చేపట్టారు. గతంలో మనుషుల ద్వారానే బావులను తవ్వించేవారు. కానీ నేడు యంత్రాల సహాయంతోనే పనులు వేగంగా చేస్తున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో బావుల తవ్వకం చేపట్టగా.. వీపనగండ్ల మండ లం సంపత్రావ్పల్లి లోనే దాదాపు 15 బావులను కొత్తగా తీయించారు. సంగినేనిపల్లి, అయ్యవారిపల్లి తదితర గ్రామాల్లో బావులను తవ్వుకున్నారు. ఈ బావుల ద్వారాపంట చేతికి అందుతుందన్న భరోసాతో రైతులు ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కో బావికి లక్ష వర కు రైతులు ఖర్చు చేస్తున్నారు. సంపత్రావ్పల్లిలో బండారు నాగన్న, ఓరే మహేశ్, గోపాల వెంకటస్వామి, మిద్దె కురుమయ్య, ఓరే మల్ల య్య, ఓరే వెంకటేశ్, మేకల లక్ష్మయ్య, మేకల ఉశాన్ తదితరులు బావులను తవ్వించారు.
ఈ సారి నీటి ఎద్దడి చూసి గ్రామంలో చా లా మంది కొత్తగా బా వులు తవ్వుకున్నారు. పది మందికి పైగానే రైతులు జేసీబీలతో తోడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నీటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ నేడు బోరు ఉన్నా నమ్మకం లేదు. బావి ఉంటే, కనీసం రెండు లేదా మూ డు తడులకైనా నీళ్లు అందుతాయన్న నమ్మకం. కొత్త బావికి దాదాపు రూ.లక్ష ఖర్చు అయింది.
– నాగన్న, రైతు, సంపత్రావ్పల్లి, వీపనగండ్ల మండలం, వనపర్తి జిల్లా
ఈ ఏడాది మాత్రమే కొత్త బావుల పనులు వచ్చాయి. చాలా మంది రైతులు నీటి ఎద్దడిని తట్టుకోలేక మళ్లీ కొత్తగా బావులను తవ్వించారు. జిల్లాలో 4 జేసీబీలు ఇలా కొత్త బావులను తవ్వే పనులు చేశారు. మేమే ఈ నాలుగైదు నెలల్లో దాదాపు 50 నుండి 60 బావుల వరకు కొత్తగా తవ్వాం. ఈ 25 ఏండ్లలో కొత్తగా బావులు తవ్విన సందర్భాలు చాలా తక్కువ.
– వెంకటేశ్వర్‌రెడ్డి, జేసీబీ యజమాని, కల్వరాల, వనపర్తి జిల్లా