హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం సీజన్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా ఇప్పటికే వరంగల్, జనగామ, ఆదిలాబాద్, చెన్నూర్, భద్రాచలం, చిన్నకోడూరు, పెద్దపల్లి మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. మరికొందరికి చార్జిమెమోలు జారీచేయనుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు దళారులతో కుమ్మకై తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) సహాయంతో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోళ్లు జరిపి, ఎక్కువ ధరకు సీసీఐకి విక్రయించినట్టు సమాచారం.
పత్తి రైతుల పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) వద్ద నమోదై ఉండాలి. అలా నమోదైన రైతులు మాత్రమే ఎకరాకు గరిష్ఠంగా 12 క్వింటాళ్ల వరకు మద్దతు ధర (క్వింటాలుకు రూ.7,521)తో సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించే అవకాశం ఉంటుంది. కానీ, పలు చోట్ల ఏఈవోలు పత్తి సాగుచేసిన రైతుల వివరాలను నమోదు చేయనట్టు తెలిసింది. అలాంటి రైతులు మార్కెట్లలో టీఆర్‌లు తీసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ అందుకు అధికారులు సహకరించలేదు. దీంతో ఆయా రైతులు మద్దతు ధరతో సీసీఐకి పత్తి విక్రయించే అవకాశం లేకుండా పోయింది.
దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు రైతుల పేరిట ఏఈవోల నుంచి మాన్యువల్‌గా పంటల సాగు ధ్రువీకరణ పత్రాలను పొందారు. వాటి సాయంతో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి క్వింటా రూ.5,500 నుంచి రూ.6 వేలకు కొనుగోలు చేశారని, అనంతరం ఆ సరకును గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు తీసుకొచ్చారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వ్యాపారులు/దళారులతో కుమ్మక్కయిన కొందరు మార్కెట్ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు వారికి టీఆర్‌లు జారీ చేయడంతోపాటు వాటిని ఆన్లైన్లో నమోదు చేశారు. వాటి సాయంతో తక్కువ ధరకు కొన్న పత్తిని వ్యాపారులు మద్దతు ధరకు సీసీఐకి విక్రయించారు. టీఆర్‌లు పరిశీలించాల్సిన సీసీఐ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. దీంతో అంతిమంగా రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. రైతుల నుంచి సేకరించిన సరకుకు, సీసీఐ కొనుగోలు చేసిన సరకుకు భారీ వ్యత్యాసం ఉండటంతోపాటు టీఆర్లలోనూ భారీగా తేడాలు ఉన్నట్టు ఈ తనిఖీల్లో తేలింది.
గత వానకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. తద్వారా 25.38 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయడంతో 110 వ్యవసాయ మార్కెట్లు, 76 కాటన్ మార్కెట్లు, 232 పత్తి మిల్లుల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు. అలా 8.42 లక్షల మంది రైతుల నుంచి రూ.14,921 కోట్ల విలువైన 20.15 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేశారు. అందులో అధికారికంగా ప్రైవేటు వ్యాపారుల నుంచి 3.18 లక్షల టన్నులు, అనధికారికంగా జనవరి చివరి నాటికి వ్యాపారులు, రైతుల నుంచి దాదాపు 8 లక్షల టన్నుల పంటను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇందులో దాదాపు 5 లక్షల టన్నుల పత్తిని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అక్రమ టీఆర్‌లతో సీసీఐకి మద్దతు ధరకు అమ్మినట్టు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా పత్తి కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 7 మార్కెట్ల కార్యదర్శులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. మిగిలినవారిపై చర్యలు చేపడుతుందా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు ఎక్కువగా జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మార్కెటింగ్ శాఖ అధికారులను సంప్రదించగా.. టీఆర్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిగిందని, అందుకు బాధ్యులైన కొందరిని ఇప్పటికే సస్పెండ్ చేశామని చెప్పారు. మిగిలినవారిపై విచారణ కొనసాగుతోందని, అక్రమాలకు పాల్పడినట్టు తేలితే వారికి కూడా త్వరలోనే చార్జిమెమోలు జారీ చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.