Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల ఖిల్లాగా మారింది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ పాలనలో ఉపాధికి నిలయంగా రూపుదిద్దుకొన్నది. హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంత జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమల్లో పనిచేయడానికి పొరుగు రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఉపాధికోసం రాష్ర్టానికి తరలివస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం, సులభతర వాణిజ్యం వంటి నిర్ణయాలే దీనికి కారణం. వెరసి రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. పరిశ్రమల్లో 15లక్షల పైచిలుకు ఉద్యోగాలతో తెలంగాణ దేశంలోనే ఏడోస్థానంలో.. చిన్న రాష్ర్టాల క్యాటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024 (తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్-అట్లాస్) ఈ మేరకు వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటుకావడానికి, ఉపాధి అవకాశాలు విస్తృతమవ్వడానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలే కారణమని గణాంక నివేదిక కుండబద్దలు కొట్టింది. 30 రోజుల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు మార్గాన్నిసుగమం చేసే టీఎస్ఐపాస్, ఆన్లైన్లోనే లేఅవుట్లకు అనుమతినిచ్చేందుకు ఉద్దేశించిన టీఎస్‌బీపాస్‌తో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు క్యూకట్టినట్టు నివేదిక ప్రశంసించింది. ఇక, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీహబ్, దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్ టీవర్క్స్, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన ఇంక్యుబేటర్ వీహబ్‌తో ఐటీ, సేవారంగాల్లో కొత్త కంపెనీల ఏర్పాటు జరిగిందని నివేదిక వెల్లడించింది.
జనాభా తక్కువగా ఉన్నా.. జీవీఏ భేష్
తెలంగాణ ఏర్పాటుకు ముందు సరైన ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో వలసలు అనేవి నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో అనతికాలంలోనే తెలంగాణ.. పలు పెద్ద రాష్ర్టాలను వెనక్కునెట్టి పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనలో అగ్రస్థానానికి చేరుకున్నది. తెలంగాణలో ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా 2,436 పరిశ్రమలు ఉండగా, వాటిల్లో 1,67,406 మంది ఉద్యోగులు, మరో 1,24,469 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలున్నాయి. మొత్తం రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఒక్క మేడ్చల్-మల్కాజ్గిరిలోనే 23.5శాతం ఉండగా, కార్మికులు, ఉద్యోగులు సైతం అధికంగా ఈ జిల్లాలో పనిచేస్తున్నారు. పరిశ్రమల జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో తెలంగాణ.. దేశంలో 9వ స్థానంలో నిలిచింది. 2022-23లో దేశ పరిశ్రమల జీవీఏలో తెలంగాణ పరిశ్రమల వాటా 3.37శాతంగా నమోదైంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8శాతమే అయినప్పటికీ జీవీఏలో మాత్రం 3.37శాతంగా ఉండడం గమనార్హం.
హైదరాబాద్ కేంద్రంగా..
హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పెద్ద ఎత్తున ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉదాహరణకు నాచారం, చెర్లపల్లి, ఇబ్రహీంపట్నం, కాటేదాన్, బాలానగర్, జీడిమెట్ల, పటాన్చెరు, రామచంద్రాపురం తదితర పారిశ్రామికవాడల్లో యూపీ, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలకు చెందిన కార్మికులు అత్యధికంగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు బీహెచ్ఈఎల్, ఎన్ఎండీసీ, హెచ్ఎంటీ, బీఈఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, డీఆర్డీఓ, హెచ్ఏఎల్ తదితర ప్రభుత్వరంగ సంస్థలకు నిలయంగా ఉన్న హైదరాబాద్… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తరువాత విభిన్న రంగాలకు చెందిన పరిశ్రమలకు నిలయంగా మారి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏర్పాటు కాకపోగా, ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపోయి రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తమయ్యాయి. తాజా నివేదికను విశ్లేషిస్తే ఇది నిజమేనని అర్థమవుతున్నది.
టీఎస్ఐపాస్తో వేగవంతం
ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో పారిశ్రామిక రంగం ఎంతో కీలకమనే విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పటీ సీఎం కేసీఆర్ పారిశ్రామికరంగ ప్రముఖులతో సమావేశమై నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. టీఎస్ఐపాస్ విధానం చేపట్టి సులభంగా పరిశ్రమలకు అనుమతులు, ఆకర్షణీ య ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించా రు. ఫలితంగా పరిశ్రమల స్థాపన ఊపందుకున్నది. రాష్ట్ర గణాంకాల శాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో టీఎస్ఐపాస్ విధానం ప్రవేశపెట్టాక పరిశ్రమల ఏర్పాటు వేగవంతమైంది. 13,063 పరిశ్రమలకుగాను 10,368 పరిశ్రమలు కొనసాగుతుండగా, వీటిలో 7,08,219 మంది కార్మికులు, 8,37,235మంది ఉద్యోగులు కలిపి మొత్తంగా 15.45లక్షలమంది పనిచేస్తున్నారు. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా తరువాత పరిశ్రమల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచింది. హర్యానా మినహా చిన్న రాష్ర్టాల క్యాటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
జీఎస్డీపీలో దేని వాటా ఎంతంటే?
2023-24 తెలంగాణ జీఎస్డీపీ రూ. 15.01 లక్షల కోట్లుగా నమోదైంది. ఇందులో సేవారంగం వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉపాధి అవకాశాలను బట్టి చూస్తే, వ్యవసాయం, దాని అనుబంధరంగాలదే పైచేయిగా ఉన్నట్టు రాష్ట్ర గణాంక నివేదిక-2024 వెల్లడించింది.
అన్నింటా తెలంగాణ భేష్
కేసీఆర్ పాలనలో
తెలంగాణ జీఎస్డీపీలో ఏ రంగంవాటా ఎంతంటే?
తెలంగాణ జీఎస్డీపీలో ఉపాధి అవకాశాల వాటా