కాటారం, జనవరి 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మీనాక్షి కాటన్ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు, మిల్లు యజమానుల కథనం ప్రకారం.. మీనాక్షి జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తికొనుగోలు కేంద్రంతో పాటు మిల్లు ఆధ్వర్యంలో ప్రైవేటుగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. సీసీఐ ద్వారా కొనుగోలు చేసిన పత్తి ఓ వైపు, దానికి కొంచెం దూరంలో మిల్లర్లు కొనుగోలు చేసిన పత్తి కుప్ప మరోవైపు ఉన్నది. గురువారం ఒకసారిగా మిల్లర్లు కొన్న పత్తి కుప్పకు మంటలు అంటుకున్నాయి.
మిల్లు నిర్వాహకులు కిషన్, కిశోర్ ఫైరింజిన్కు సమాచారమిచ్చి, మిల్లులో నీటిని పంపింగ్ చేసే పైప్లైన్ ద్వారా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో 2వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైనట్లు మిల్లు నిర్వాహకుడు కిషన్ తెలిపారు. రూ.కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. మిల్లు ఆవరణలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉంది. మిల్లు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.