Revanth Reddy | హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి, 17 మంది చనిపోయారు. వీరిలో 8 మంది చిన్నారులున్నారు. ఇంత భారీ ప్రమాదం జరిగినా సీఎం రేవంత్‌రెడ్డి చలించలేదని రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోనే ఉన్నారు. ముఖ్యమైన సమావేశాలు, భేటీలు కూడా జరగలేదు. అయినప్పటికీ ప్రమాద స్థలానికి సీఎం వెళ్లలేదు. అక్కడికి వెళ్లాల్సిందిగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని ప్రకటనలు వచ్చాయి.
తర్వాత డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార్కను కూడా ఆదేశించారంటూ మరో ప్రకటన వచ్చింది. ప్రభుత్వ వర్గాల నుంచి కొందరు మాట్లాడుతూ.. సీఎం వెళ్తే భద్రత సమస్య ఉం టుంది. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమని అనుకుంటే సహాయ చర్యలు పూర్తయిన తర్వాతైనా వెళ్లొచ్చు కదా.. ఎందుకు వెళ్లలేదని మరికొందరు నిలదీస్తున్నారు.
ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిన ఘటనలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి వైఖరే అవలంబించారని రాజకీయవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఘటనలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. వాళ్లు బతికున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఆ తర్వాత జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. సీఎం రేవంత్‌రెడ్డి చలించలేదని, అడుగు కదపలేదని, అక్కడికి ఎం దుకు వెళ్లలేదని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఘటన జరిగిన 11 రోజులకు ప్రమాద స్థలానికి వెళ్లారు.
తాను వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని, అందుకే వెళ్లలేదని సమర్థించుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వైఖరే పునరావృతమవుతున్నది. ఘోర అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మృత్యువాతపడితే సీఎం రేవంత్‌రెడ్డి కనీసం చూడడానికి వెళ్లరా అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి, తీరుపై కొందరు కాంగ్రెస్ సీనియర్‌నేతలు కూడా మండిపడుతున్నారు.