Nizamabad | వినాయక్ నగర్, నవంబర్, 26 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన పత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో గ్రామీణ బ్యాంక్ లోపలి నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఆ తర్వాత మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నగర సీఐ శ్రీనివాస్ రాజు, మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది సైతం అక్కడికి చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, బ్యాంకు లోపల నుంచి భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా ఎవరు కూడా బ్యాంకు లోపలికి వెళ్లలేకపోయారు.

దాదాపు రెండుగంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బ్యాంకు అధికారులు సిబ్బంది సైతం ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు బ్యాంకు లోపల ఉన్న విలువైన పత్రాలను బయటకు తీయించేందుకు యత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. మంటలను పూర్తిగా ఆర్పి వేసిన అనంతరం పోలీసులు, బ్యాంకు సిబ్బంది లోనికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే బ్యాంకులో పని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో 25 కంప్యూటర్లు, 7 ఏసీలతో పాటు పలు విలువైన డాకుమెంట్స్ సైతం కాలిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై బ్యాంకు మేనేజర్ వారణాసి రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లుగా త్రీ టౌన్ ఎస్ఐ హరిబాబు వెల్లడించారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? మరేమైనా ఏవైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.