బుధవారం 03 జూన్ 2020
Telangana - May 08, 2020 , 02:06:48

మాస్క్‌ లేకుంటే వెయ్యి జరిమానా

మాస్క్‌ లేకుంటే వెయ్యి జరిమానా

 • లాక్‌డౌన్‌కు మార్గదర్శకాలు విడుదల
 • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇండ్ల నుంచి పనులకోసం బయటకు వచ్చేవారు విధిగా మాస్క్‌ ధరించాలని, మాస్క్‌ లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో దానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం విడుదలచేసింది. ఈ మార్గదర్శకాలను కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 

 ఇవీ మార్గదర్శకాలు.. 

 • రాష్ట్రమంతటా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అత్యవసరంగా వైద్య సహాయం కావాల్సినవారికి మాత్రమే ఆ సమయంలో బయటకు వెళ్లడానికి అనుమతినిస్తారు. దవాఖానలు, మెడికల్‌ షాపులు మినహా అన్ని రకాల  దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలి.
 • వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, దవాఖానలు, వాటికి అనుబంధంగా పనిచేసే సంస్థలు, ఉపాధి హామీ పథకం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలికం, పోస్టల్‌, ఇంటర్నెట్‌ సేవలు, ఐటీ, ఐటీఈఎస్‌ సంబంధిత సర్వీసులు, నిత్యావసర సరుకుల సరఫరా చైన్‌, పెట్రోల్‌ పంప్‌లు, ఎల్పీజీ సరఫరాకు మినహాయింపు.
 • గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో నిర్మాణ కార్యక్రమాలకు అనుమతి. అయితే రెడ్‌జోన్లతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో స్థానికంగా ఉండే కార్మికులతోనే పని చేయించుకోవాలి.
 • గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పారిశ్రామిక కార్యక్రమాలకు అనుమతి. ఆరేంజ్‌, గ్రీన్‌ జోన్లలో స్టోన్‌ క్రషర్‌ మిల్స్‌, ఇటుకబట్టీలు, చేనేత మగ్గాలు, సాంచాలు, రిపేర్‌ వర్క్‌షాప్స్‌, బీడీల తయారీ, ఇసుక, ఇతర మైనింగ్‌ కార్యకలాపాలు, సిరామిక్‌ టైల్స్‌, రూఫ్‌ టైల్స్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, జిన్నింగ్‌ మిల్స్‌, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఇండస్ట్రీ, ప్లాస్టిక్స్‌ అండ్‌ శానిటరీ పైప్‌ల పరిశ్రమ, పేపర్‌ పరిశ్రమ, దూది పరుపులు, ప్లాస్టిక్‌ అండ్‌ రబ్బర్‌ పరిశ్రమ, నిర్మాణ వర్క్‌, ఇతర ఐటమ్స్‌ విక్రయించే షాప్‌లకు అనుమతి.
 • రెడ్‌జోన్లు, అర్బన్‌ ఏరియాలలోని సెజ్‌లలో ఉండే పరిశ్రమలు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్‌, ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్స్‌, డ్రగ్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, వైద్య పరికరాలు, వాటి ముడిసరుకుల తయారీకి అనుమతి. ఐటీ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌, ప్యాకింగ్‌ తయారీ యూనిట్లకు అనుమతి. 
 • గ్రామీణ ప్రాంతాల్లో మాల్స్‌ మినహా అన్ని రకాల షాప్‌లకు అనుమతి. జీహెచ్‌ఎంసీ, రెడ్‌జోన్‌ కాని పట్టణాలలో షాప్‌లకు అనుమతి. మార్కెట్లు, మాల్స్‌, కాంప్లెక్స్‌లకు అనుమతిలేదు. అయితే షాప్‌లను భౌతికదూరం పాటించేవిధంగా రోజు విడిచి రోజు తెరువడానికి మాత్రమే అనుమతి. దీనికి సంబంధించిన రోస్టర్‌ను అమలు చేసేలా మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలి.
 • ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఎలాంటి వస్తువులనైనా ఈ-కామర్స్‌ ద్వారా తెప్పించుకోవచ్చు. రెడ్‌జోన్లు, జీహెచ్‌ఎంసీలో ఈ కామర్స్‌ ద్వారా నిత్యావసరాలకే అనుమతి.
 • జీహెచ్‌ఎంసీ, రెడ్‌జోన్‌ ఏరియాలలో ప్రైవేట్‌ కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్‌ కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులతో పనిచేయించుకోవాలి. మిగతావారితో వర్క్‌ఫ్రమ్‌ హోం కొనసాగించాలి. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగులతో పనులు చేయించుకోవచ్చు.
 • రెడ్‌జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సెక్రెటరీ స్థాయివరకు వందశాతం హాజరుకావాలి. మిగిలిన సిబ్బంది 33 శాతం హాజరైతే చాలు. ప్రజలకు సేవలందించడానికి రక్షణ, సెక్యూరిటీ, వైద్య, పోలీస్‌, వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌, రెవెన్యూ, జైళ్లు,  హోమ్‌గార్డులు, సివిల్‌ డిఫెన్స్‌, ఫైర్‌, ఎమర్జెన్సీ సర్వీసెస్‌, విపత్తుల నిర్వహణ, ఎన్‌ఐసీ, కస్టమ్స్‌, ఎఫ్‌సీఐ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల ఉద్యోగులంతా పనిచేయాలి. 
 • రెడ్‌ జోన్స్‌లో రెస్టారెంట్లు, బార్బర్‌షాపులు, స్పాలు, సెలూన్‌లు, ట్యాక్సీలు, క్యాబ్‌ సర్వీసులు, ఆటోరిక్షాలకు అనుమతి లేదు.
 • ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ట్యాక్సీలకు అనుమతి. వాటిలో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి.
 • యథావిధిగా విమాన, రైలు, బస్సు, మెట్రో సర్వీసులపై నిషేధం కొనసాగుతుంది. 
 • అన్ని విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, శిక్షణ కేంద్రాలు మూసి ఉంచాలి. హోటల్స్‌, లాడ్జీలు, బార్లు, పబ్‌లు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌, జిమ్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, స్పోర్ట్స్‌కాంప్లెక్స్‌, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ జూపార్క్‌, మ్యూజియాలు, ఆడిటోరియాలు బంద్‌.
 • అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, బహిరంగ ప్రదేశాలలో పూజలు, మత ప్రార్థనలు నిషేధం


logo