నర్సాపూర్, డిసెంబర్13: ఊరంతా విద్యుత్ షాక్ గురై వివాహిత మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎర్రకుంటతండా గ్రామపంచాయతీ పరిధిలోని బాల్యాతండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. తండావాసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉన్న సామగ్రికి, గోడలకు, ఇతర వస్తువులకు విద్యుత్ సరఫరా జరిగి షాక్ రావడంతో తండావాసులు ఆందోళనకు గురయ్యారు. బాల్యాతండాకు చెందిన హలావత్ అనిత వంటగదిలో స్టీల్ వస్తువు తగిలి విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఎవరూ స్పందించలేదని, ఉదయం 10 గంటల వరకు ఏ అధికారి రాలేదని తండావాసులు వాపోయారు. మృతురాలు అనితకు భర్త శ్రీనివాస్, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.