హైదరాబాద్ సిటీబ్యూరో/బేగంపేట, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుటుంబంలో చిచ్చు రేగిందా? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుకు మర్రి శశిధర్‌రెడ్డి, మనువడు ఆదిత్యారెడ్డి ఒకే నియోజకవర్గం నుంచి తలపడేందుకు సిద్ధమవుతున్నారా? సనత్‌నగర్ నియోజకవర్గంలో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మర్రి శశధర్‌రెడ్డి సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కొడుకు ఆదిత్యారెడ్డి మాత్రం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇలా వేర్వేరు పార్టీల నుంచి తలపడేందుకు సిద్ధమవుతున్న తండ్రీ కొడుకులకు టికెట్లు ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. ఆదిత్యారెడ్డి ఒక పక్క తన తాత మర్రి చెన్నారెడ్డి ఫొటో, మరో పక్క తన ఫొటోతో ఫ్లెక్సీలు రూపొందించారు. తండ్రీ కొడుకుల మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే టాక్ వినిపిస్తున్నది. అయితే తండ్రీ కొడుకులు వ్యూహాత్మకంగానే చెరో పార్టీలో కొనసాగుతున్నారనే చర్చ కూడా నడుస్తున్నది.