హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, జులై 28 (నమస్తే తెలంగాణ): తమను ఎవరైనా మోసం చేస్తే ప్రభుత్వం, చట్టాలు ఆదుకుంటాయని ప్రజలు నమ్ముతుంటారు. మరి అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే మోసగిస్తే? ఓట్ల కోసం కపట నాటకం ఆడి, అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచితే? చివరికి ప్రభుత్వం న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తే? న్యాయం ఎక్కడికి వెళ్లాలి. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఇది. పూటకో వేషం మాదిరిగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో రైతులు విసిగిపోయారు. తిరగబడి నిలదీయడం తప్ప మరో మా ర్గం లేదని నిర్ణయానికి వచ్చారు. అందుకే ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలపై మర్లబడుతున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం భూములను తిరిగి ఇచ్చేయాలని నిలదీస్తున్నా రు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని రైతులను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చాక అనధికారికంగా ‘రద్దు’ ప్రకటన చేసి, ఆ భూములను ఫార్మాసిటీ కోసమే వినియోగిస్తామని కోర్టులో చెప్పి, క్షేత్రస్థాయిలో మాత్రం ఫ్యూచర్ సిటీ కోసం భూములను కేటాయిస్తున్నది. ఇప్పటికైనా రైతుల భూములను తిరిగి ఇస్తారా? లేదా మాట తప్పామని ఒప్పుకొని ఫ్యూచర్ సిటీని కొనసాగిస్తారా? అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తేల్చి చెప్పాలి.
కేసీఆర్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతి పెద్ద గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333.20 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయించింది. 14వేల పైచిలుకు ఎకరాల భూమిని రైతులను ఒప్పించి సేకరించింది. ఒకవేళ ఈ భూములను ఫార్మాసిటీకి కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తే రైతులు భూమి తిరిగి పొందవచ్చనే షరతును భూ సేకరణ నోటిఫికేషన్లో పొందుపరిచింది. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు కోసం పనులు ప్రారంభించింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి మొదటి దశ అనుమతులు కూడా సాధించింది. మౌలిక వసతులు అభివృద్ధి చేసింది. దీంతో దాదాపు 300-400 వరకు ఫార్మా కంపెనీలు అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి భూములు కేటాయించడమే తరువాయి. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఫార్మా సిటీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరో రోజే సీఎం రేవంత్‌రెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఫార్మా సిటీని అక్కడి నుంచి తరలిస్తామని, అక్కడ మెగా సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఔటర్ రింగు రోడ్డు- ట్రిపుల్ ఆర్ మధ్యలో పారిశ్రామికవాడల గుర్తింపు కోసం 500 నుంచి వెయ్యి ఎకరాల భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా సిటీని రద్దు చేసి, తమ భూములను వెనక్కి ఇస్తుందని రైతులందరూ భావించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాటమార్చి ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చిట్‌చాట్‌లో చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు.
2024 మార్చిలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘ఔటర్ రింగు రోడ్డు-ట్రిపుల్ ఆర్ మధ్య మూడు వేల ఎకరాల్లో వివిధ ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఫార్మాసిటీ విధానం సరైంది కాదు. అందుకే దానిని రద్దు చేసి, అక్కడ శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఒక సందర్భంలో ఫార్మా సిటీని రద్దు చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటనలకైతే హద్దే లేకుండా పోయింది. ఒకసారేమో అసలు ఫార్మా సిటీ ఎక్కడిది? అది ముగిసిన అధ్యాయం అన్నట్టుగా మాట్లాడారు. మరోసారి ఫార్మా సిటీ ఉంటుందని చెప్పారు. ఇంకోసారి ఫార్మా సిటీ ఉండదు, అక్కడ ఫోర్త్ సిటీ వస్తుంది, అయితే రైతుల భూముల్ని మాత్రం తిరిగి ఇవ్వము అని ప్రకటించారు. ఇలా పూటకో మాటతో ఫార్మా రైతులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసింది.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై ఫార్మా రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగితే… అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని, రైతులు పత్రికల్లో వచ్చిన ప్రకటనలను చూసి కోర్టుకు వచ్చారని బుకాయించింది. ఫార్మాసిటీని కచ్చితంగా ఏర్పాటుచేస్తామంటూ కోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి బేగరికంచె వేదికగా అక్కడ ఫోర్త్‌సిటీ ఏర్పాటుచేస్తున్నామని ప్రకటించారు. శంకుస్థాపనలు కూడా చేశారు. మొదట యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 150 ఎకరాలు కేటాయించారు. అప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా ఆ భూములను ఇతర అవసరాలకు కేటాయిస్తూనే ఉన్నారు. అన్నింటినీ అనుసంధానం చేసేలా 41 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరుతో 300 ఫీట్ల వెడల్పుతో రహదారిని ఏర్పాటు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 14వేల పైచిలుకు ఎకరాలను సేకరించగా, ఇంకా కొంత భూమిని సేకరించాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సేకరించిన భూములను తిరిగి ఇవ్వకపోగా, మిగతా భూమిని కూడా వదలడం లేదు. అనేక మంది రైతులు పరిహారం తీసుకోకపోవడంతో కోర్టులో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. రైతుల నుంచి బలవంతంగా తీసుకొని ఫెన్సింగ్ కూడా వేశారు. చివరకు కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేసి భూములను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కనీసం తమ భూములైనా వదిలివేయాలంటూ 2,500 ఎకరాల విస్తీర్ణంలోని రైతులు కొన్ని నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా ఆగిపోయిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం పరిహారంతో పాటు ఇండ్ల స్థలాలు ఇచ్చింది. ఉద్యోగ కల్పనపై హామీ ఇచ్చి, నైపుణ్యాల కోసం యువతకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించింది. కానీ వారిని కాంగ్రెస్ తీవ్రంగా రెచ్చగొట్టింది. ‘మేము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి, మీ భూముల్ని మీకు తిరిగి ఇస్తాం’ అంటూ నేతలు ప్రకటించారు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు ఫార్మా గ్రామాల్లో తిరిగారు. గడప గడపకు వెళ్లి ‘మీ భూములను కచ్చితంగా తిరిగి ఇస్తాం’ అంటూ హామీ ఇచ్చారు. దీంతో రైతులు వారిని నమ్మారు.