హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): నమ్మి ఓట్లేసిన ప్రజలపై మరో పిడుగు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో భూములు, ఆస్తుల మార్కెట్ విలువల పెంపునకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. పల్లె, పట్నం అన్న తేడాలేకుండా అంతటా రిజిస్ట్రేషన్ల పెంపు భారం పడనున్నది. అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదికపై సోమవారం క్యాబినెట్లో చర్చించారు. మార్కెట్ విలువలను రెండుమూడింతలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. వ్యవసాయ భూముల ధరలు మూడింతలు, వ్యవసాయేతర ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్లపై రెండింతలకుపైగా భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో రూ.1 లక్షగా ఉన్న ఎకరం ధరను రూ.3లక్షలకు, నగరాల్లో రూ.6లక్షలుగా ఉన్న భూమి ధరను రూ.18 లక్షలకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పెంపు తొలిదశే కాగా మరోసారి ఈ ఏడాదిలోనే పెంచుకోవాలనే సిఫార్సుపైనా క్యాబినెట్ చర్చించింది. అయితే ఏడాదికి ఒకసారి మాత్రమే మార్కెట్ విలువల సవరణ చేసి ధరలను పెంచాలని నిర్ణయించింది. ఇటీవలే టీజీఐఐసీ, హెచ్ఎండీఏ వేలంలో కోకాపేట, ఖానామెట్‌లో రూ.150 కోట్లకుపైగా ధర పలికిన భూముల గురించి కూడా ఆరా తీసి, వాటి ధరల పెంపునకు ఉన్న సాధ్యాసాధ్యాలను చర్చించారు.
రూ.29వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా..
వ్యవసాయ భూములు, నాన్ కన్వర్టబుల్ ల్యాండ్స్, హైవేలు, నివాసయోగ్యమైన పాట్ల ధరలు ప్రామాణికంగా పెరుగనున్నాయి. తాజా పెంపు కోర్ అర్బన్ ఏరియా ప్రజలకు భారంగా మారనున్నది. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధిలో వ్యవసాయ భూములు 300 శాతంపైగా, ఇంటిస్థలాలపై 150 నుంచి 200శాతం, అపార్టుమెంట్లు చదరపు అడుగుకు 50శాతంపైగా పెరగనున్నాయి. రీజినల్ రింగ్‌రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీల పరిధిలో 300 శాతంపైగా పెంపు ఉండనున్నది. ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల ధరలు గరిష్ఠంగా మూడు రెట్లు పెరిగే అవకాశం ఉన్నది. అపార్టుమెంట్లకు ప్రస్తుతం ఉన్న చదరపు ఫీటు ధర రూ.2,200 నుంచి రూ.2,800కు పెరగనున్నది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో రూ.8 వేలకుపైగా పెరుగనున్నది. ఈ పెంపు భారంతో ఖజానాకు ఈ ఏడాది రూ.29 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం స్కెచ్ వేసింది. స్టాంపు డ్యూటీని మహిళలకు స్వల్పంగా తగ్గించాలని, పారిశ్రామిక వినియోగ భూములకూ స్వల్పంగా తగ్గించేందుకు ఆమోదం తెలిపినట్టు సమాచారం.
రియల్ ఎస్టేట్‌పై పెను ప్రభావం
పల్లెలు, పట్నం తేడా లేకుండా, వాస్తవికతను దృష్టిలో పెట్టుకోకుండా చేస్తున్న విలువల సవరణతో రియల్ రంగం మరింత పతనం కావడం తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు మందగించాయి. పట్టణాల్లోనూ ఫ్లాట్లు, ప్లాట్లు, ఇండ్ల లావాదేవీలు ఇదే తరహాలో పతనం వైపు సాగుతున్నాయి. అయినా క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం లేకుండా, కేవలం రాబడిని దృష్టిలో పెట్టుకొని అమలు చేయనున్న పెంపుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.