హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కారించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 17 నెలలుగా వేచి చూసినా ప్రభుత్వం హామీలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శనివారం భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దాదాపు రూ.9వేల కోట్లను యుద్ధప్రాతిపదికన విడుదల చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలని విన్నవించారు.