శేరిలింగంపల్లి, జూలై 24: ఉద్యోగులకు న్యాయం జరిగేవరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. గోపన్‌పల్లిలోని బీటీఎన్జీవోస్ స్థలాల్లో ప్రైవేట్ వ్యక్తుల భూ ఆక్రమణలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా 9వ రోజు ఏర్పాటైన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగర్ టీఎన్జీవోస్ స్థలాల ఆక్రమణల విషయంలో తమకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేదిలేదని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే పలువురు మంత్రులు, అధికారులను కలిసి సమస్యను విన్నవించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి, ఆయన నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నంత వరకు సమ్మె కొనసాగుతుందని పేర్కొన్నారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ త్వరలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం కార్యాలయంలో జేఏసీ సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు కేటాయించిన స్థలాల్లోని ఆక్రమణలను తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, అసోసియేషన్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు తదితర ఉద్యోగ సంఘాల జేఏసీ, సొసైటీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.