హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయారని, అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు.
ఒడిశాలోని చిత్రకొండలో 2008, జూన్ 29న మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది తెలంగాణ పోలీస్ అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించామని చెప్పారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది అమరులైతే.. అందులో తెలంగాణకు చెందినవారు ఆరుగురు ఉన్నారని చెప్పారు. గ్రేహౌండ్స్ కమాండోలు టీ సందీప్, వీ శ్రీధర్, ఎన్ పవన్‌కల్యాణ్‌లు సంఘవిద్రోహశక్తులతో పోరాడి చనిపోయారని, అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్లాల్, నల్లగొండ కానిస్టేబుల్ బీ సైదులు విధినిర్వహణలో మరణించారని, మూడు రోజుల కిందట నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ వీర మరణం చెందారని చెప్పారు. అమరులైన ఐదుగురితోపాటు ప్రమోద్ కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
మహిళా అధికారులకు ప్రాధాన్యం..
పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌లు సారథ్యం వహించడం గర్వకారణమని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే ఉన్నారని చెప్పారు. అనంతరం కొత్తగా ఏర్పాటుచేసిన పోలీసు అమరవీరుల స్థూపాన్ని సీఎం ఆవిష్కరించారు. అమరుల కుటుంబాలకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సీవీ ఆనంద్, డీజీపీ శివధర్‌రెడ్డి, డీజీలు, మాజీ డీజీలు, అడిషనల్ డీజీలు, సీపీలు, ఎస్పీలు, అమరుల కుటుంబాలు పాల్గొన్నారు.