హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘ఆయుధాలను వదిలేసి.. ప్రజల్లోకి వెళ్దాం’ అని మావోయిస్టు (Maoists) పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో గతంలోనే నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడున్నరేండ్ల తర్వాత 2024లో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలోనే ఆయుధాలు వదిలేయాలనే ప్రతిపాదన వచ్చిందని, దానిపై కొందరు ఏకీభవించగా.. మరికొందరు వ్యతిరేకించారని తెలిసింది. పొలిట్‌బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను దేశంలోని అన్ని క్యాడర్లు, కమిటీలకు చేరేలా సిద్ధం చేసిన డాక్యుమెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ నష్టపోతున్న పరిస్థితులు, అందుకు కారణమైన పోలీసు ఆపరేషన్లు, తగ్గిన రిక్రూట్మెంట్లు, పెరిగిన మావోయిస్టుల మరణాలపై సుదీర్ఘమైన డాక్యుమెంట్లో ప్రస్తావించారు.
ఈ డాక్యుమెంట్‌ను ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అన్ని రాష్ర్టాల డీజీపీల సదస్సులో తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి అందజేయగా.. దానిపై సుదీర్ఘమైన చర్చ జరిగినట్టు తెలిసింది. పొలిట్‌బ్యూరో విడుదల చేసిన డాక్యుమెంట్ ప్రకారం.. గడిచిన మూడేండ్లలో 683 మంది మావోయిస్టులు చనిపోయారని, వారిలో 190 మంది మహిళలు ఉన్నారని ప్రస్తావించారు. మూడేండ్లలో మావోయిస్టులు మొత్తం 669 ఆపరేషన్లు నిర్వహించారని, వాటిలో 261 మంది పోలీసులు మృతిచెందగా, 516 మంది గాయపడ్డారని, 25కు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఆయుధాలను వదిలేసి, ప్రజల్లో కలిసిపోవాలని, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయాలని 2019లో నిర్వహించిన పార్టీ వారోత్సవంలోనే నిర్ణయం తీసుకున్నట్టు తాజా డాక్యుమెంట్లో ప్రస్తావించారు. పార్టీ కీలక నేతలను కోల్పోయిందని, బలగాల చర్యలను తిప్పి కొట్టడంలో కేంద్ర కమిటీతో పాటు స్టేట్, జోనల్ కమిటీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పార్టీ చాలా బలహీనపడిందని వివరించారు. మాస్ బేస్‌ను ఆకర్షించేలా వర్గ పోరాటాలు చేయలేకపోయామని పేర్కొన్నారు. తిరిగి 2024లో కూడా పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆయుధాలు వదిలేద్దామని కొందరు, వద్దని మరికొందరు పట్టుబట్టడం ఆ మీటింగ్ విఫలమైనట్టు తెలుస్తున్నది. మావోయిస్ట్ పార్టీ ముకలు కావడానికి కూడా ఈ మీటింగే కారణమని అంటున్నారు.