మహబూబ్‌నగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్వగ్రామంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ లచ్చన్న దళం పేరు మీద గ్రామంలోని ఓ ఇంటికి లేఖను అతికించారు. లేఖలో జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరులు పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిచారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి బాలానగర్, రాజాపూర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ లేఖపై విచారణ చేపట్టింది.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ పెద్ద చెరువు ఎగువ ప్రాంతంలో గత కొన్నాళ్లుగా నిర్మాణాలు చేపడుతున్న లేక్ వ్యూ వెంచర్లో నాలుగు విల్లాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేశారు. చెరువు బఫర్జోన్ల పరిధిలో నిర్మితమౌతున్న ఈ విల్లాలకు పలుమార్లు మున్సిపాలిటీ, ఇరిగేషన్‌శాఖ అధికారులు నోటీసులు జారీచేసినా మొండిగా నిర్మాణాలు చేపడుతుండటంతో స్థానిక ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ నెక్నాంపూర్లో పర్యటించిన మరుసటిరోజే కూల్చివేతలను చేపట్టారు. – మణికొండ