కాజీపేట, మే 12 : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పసునూటి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి నాలుగున్నర దశాబ్దాల పోరుబాటకు స్వస్తిపలికారు. సంతోష్ తన భార్యతో కలిసి మంగళవారం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం (పట్టణ) పరిధిలోని సోమిడికి చెందిన పసునూరి సోమనారాయణ- నర్సమ్మకు ఐదుగురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు నరహరి. 5వ తరగతి వరకు సోమిడి ప్రభుత్వ పాఠశాల, హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల కాజీపేట, 1980లో ఇంటర్ నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేసి, వరంగల్ నగరంలోని ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదివేందుకు చేరారు.
1982లో రాడికల్, నక్సలైట్ ఉద్యమాలు, విధానాలకు ఆకర్షితుడయ్యాడు. నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియా శీలకంగా పనిచేశారు. తాజాగా జార్ఖండ్‌లోని సరండా అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా లక్ష్యంగా వేటను ముమ్మరం చేశారు. అడవుల్లో భద్రతా బలగాల ఒత్తిడి పెరుగడం, మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా జార్ఖండ్ అడవుల నుంచి రహస్యంగా తెలంగాణ పోలీస్‌ల వద్దకు చేరుకున్న ఈ దంపతులు పోలీస్‌ల ఎదుట లొంగిపోయారు. సంతోష్ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద లోటుగా విశ్లేషకులు భావిస్తున్నారు. నరహరి తిరిగి జనజీవన స్రవంతిలో కలిసి వస్తున్నందుకు సోమిడి గ్రామస్తులు, కుటుంబసభ్యులు, బాల్యమిత్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.