NEP | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తేతెలంగాణ): కేంద్రం రూపొందించిన జాతీయ విద్యావిధానం తెలంగాణ అస్థిత్వానికి గొడ్డలిపెట్టు లాంటిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) ఆఫీసులో తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఎన్ఈపీ-20పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతాసిన్హా, కోదండరాం, రామమేల్కోటి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అవసరాలకు తగినట్టుగా ప్రత్యేక విద్యావిధానాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని కోదండరాం అభిప్రాయపడ్డారు.
మన సంస్కృతి, చరిత్ర ప్రత్యేకమని, ఎన్ఈపీతో మన సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. శాంతసిన్హా మాట్లాడుతూ విద్య అనేది పౌరుల ప్రాథమిక హక్కు అనే విషయాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. సమగ్రంగా చర్చించకుండానే దొడ్డిదారిన రాష్ట్రాలపై రుద్దే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. ప్రజాస్వామిక వాదులు జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించబోవని స్పష్టంచేశారు. గ్రామీణ విద్యను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రొఫెసర్ రమామేల్కొటి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అంగన్వాడీలకు వేతనాలిచ్చే స్థితిలో లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పాలసీలు తెచ్చిన నిష్ప్రయోజనమేనని వ్యాఖ్యానించారు.