మంగపేట, జూన్ 6 : అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన పలువురు దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చి, వాటిని ఇతరులకు అమ్ముకున్న వాళ్లకే మళ్లీ మంజూరు చేశారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి గుంట భూమి లేకుండా కూలిపనులు చేసుకుంటూ గుడిసెల్లో ఉంటున్న వారికి ఇండ్ల ఎంపికలో ప్రాధాన్యం కల్పించాలన్నారు.
అధికారులు క్షేత్రస్థాయి సర్వే ద్వారా పరిశీలించాకే లబ్ధిదారుల ఎంపిక చేసి, వారికి పట్టాలు పంపిణీ చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో నిర్మించుకున్న బిల్డింగ్లను చూపి ప్రస్తుతం వాటికే బిల్లులు మంజూరు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. ఇండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, వచ్చిన ఇండ్లను ఇతరులకు అమ్ముకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని, అధికారులు గుర్తించాలని కోరారు.