హైదరాబాద్, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం తరహాలోనే యావత్ దేశం పురోగమించాలని పలువురు పాస్టర్లు ఆకాంక్షించారు. దేశాన్ని ప్రగతిబాట పట్టించే సత్తా ఒక్క సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని వారు సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాబోయే రోజుల్లో అన్నిచోట్లా ఘనవిజయం సాధించాలని కోరుకున్నారు. మహారాష్ట్రలోని ముంబైలోగల ధారావి మార్నింగ్ స్టార్ స్కూల్లో ‘యునైటైడ్ పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ సర్వీస్’ పేరిట శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 300 మంది పాస్టర్లు హాజరయ్యారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. కేసీఆర్కు యేసు ప్రభువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కేసీఆర్కు అందరూ అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీ రాజేశ్వర్రావు, ప్రముఖ సినీ హస్య నటుడు జానీలివర్, గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్ (యూఎస్ఏ) రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ జేసుదాసు కడితల, మహారాష్ట్ర మాజీ మంత్రి ప్రొఫెసర్ వర్ష గైక్వాడ్, మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ మతాయి అబ్రహాం, పాస్టర్లు స్టీఫెన్ గాంధీ, రెవరెండ్ షెట్టి, సుందర్రావు, జాషువా బర్నాబాస్ తదితరులు పాల్గొన్నారు.