కుమ్రంభీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/సిర్పూర్-టీ/కౌటాల/దహెగాం, నవంబర్ 15 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలువురు మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లుడ్ రైస్)ను పక్కదారి పట్టించారు. సిర్పూర్(టీ), కౌటాల మండలాల్లో దాదాపు రూ.8 కోట్ల విలువైన ధాన్యం, దహెగాం మండలంలో మరికొంత ధాన్యం మాయమైంది. శనివారం స్టేట్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది.
సిర్పూర్-టీ మండలం మహారాష్ట్ర సరిహద్దులోగల వెంకట్రావ్పేట్లోని శ్రీసాయి బాలాజీ రైస్‌మిల్లులో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 2023-24 యాసంగికి సంబంధించి రూ.4.45 కోట్ల విలువైన 17,275.91 క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టినట్టు తహసీల్దార్ రహీమొద్దీన్ తెలిపారు.
వారంలోగా ధాన్యం లేదా డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించేందుకు మిల్లు యజమాని అంగీకరించినట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. కాగా కౌటాల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర్ రైస్ మిల్లు నిర్వాహకుడు గత మూడేళ్లలో సుమారు రూ.3.50 కోట్ల విలువైన ధాన్యం లెక్కలు చెప్పలేదని టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. దహెగాం మండల కేంద్రానికి చెందిన వాసవీ మోడ్రన్ రైస్ మిల్లులో రెండు నెలల క్రితం సోదాలు నిర్వహించగా, 54 క్వింటాళ్ల రేషన్ బియ్యం దొరికిన విషయం తెల్సిందే. అయితే శనివారం నాటి విచారణలో సదరు బియ్యానికి చెందిన పత్రాలు పరిశీలించారు.