హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): నాడు కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన గురుకులాలను.. నేడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుష్ట పన్నాగం పన్నిందని ఒక ప్రకటనలో విమర్శించారు. నాడు కేసీఆర్ హయాంలో గురుకులాలు అప్‌గ్రేడ్ అయితే.. రేవంత్ పాలనలో వాటిని డీగ్రేడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం గురుకులాల్లో కొనసాగుతున్న ఇంటర్ తరగతులను కూడా రద్దు చేసే కుట్రకు తెర తీశారని విమర్శించారు. కార్పొరేట్ కాలేజీల మనుగడ కోసమే గురుకులాలను మూసివేస్తున్నారని ధ్వజమెత్తారు.
బడా కాంట్రాక్లర్లకు ఇవ్వడానికి డబ్బులుంటాయని, ప్రపంచ అందాల పోటీలకు నిధులొస్తాయి కానీ.. పేదలు చదువుకునే గురుకులాలకు మాత్రం నిధులు ఉండవా? అని ప్రశ్నించారు. ఎస్సీ గురుకులాల్లో ఉన్న స్వీపర్లు, శానిటేషన్ సిబ్బందికి మంగళం పాడి.. విద్యార్థులతో సర్కార్ వెట్టిచాకిరీ చేయిస్తున్నదని ధ్వజమెత్తారు. కావాలనే గురుకులాల్లో అడ్మిషన్లు పడిపోయేలా కాంగ్రెస్ సర్కారు తప్పడు విధానాలు చేపడుతుందని దుయ్యబట్టారు. కమిషన్ల కోసమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి రూ.2,400 కోట్ల అంచనాలు పెంచారని విమర్శించారు. గురుకుల స్కూళ్లకు ఎందుకు అద్దెలు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురుకులాల సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు తదితరులు పాల్గొన్నారు.