Samagra Kutumba Survey | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే వివిధ కులాల మధ్య చిచ్చుపెడుతున్నది. సర్వే నేపథ్యంలో కులసంఘాలు, ఆయా కులాల మేధావులు, సామాజికవేత్తలు రెండు వర్గాలుగా చీలిపోవడం చర్చనీయాంశంగా మారింది. కొందరు కుల సంఘాల నేతలు సర్వే చేపట్టినందుకు ప్రభుత్వాన్ని ప్రశంస్తుండగా, మరికొందరు లోపాలను ఎత్తిచూపుతూ సర్వే నిర్వహిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన నాటి నుంచి కొన్ని బీసీ కుల సంఘాలు ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయి. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని, కులగణన మినహా ఇతర హామీల ఊసే ఎత్తడం లేదని పలు బీసీ కుల సంఘాలు అసహనం వ్యక్తంచేస్తున్నాయి.
ఇంటింటి సర్వేలోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదని మండిపడుతున్నాయి. సర్వేను శాస్త్రీయపద్ధతిలో నిర్వహించడం లేదని, నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సర్వేలో అనేక అసంబద్ధమైన ప్రశ్నలను చేర్చి ప్రజలను భయాందోళనకు గురి చేసిందని, ఫలితంగా మొత్తం సర్వేనే నిష్ప్రయోజనంగా మారే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాల వల్ల న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నాయి.
ఇంటింటి సర్వే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాల్లో పలు లోపాలున్నప్పటికీ మరికొన్ని కుల సంఘాలు, ఆయా వర్గాల మేధావులు ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండటం ఆయా సామాజికవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సర్వే ప్రారంభానికి ముందే కొన్ని సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలను కలిసి సన్మానించడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సర్వే పూర్తయి, నివేదిక వచ్చిన అనంతరం ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే న్యాయపరంగానైనా కొట్లాడుతామని ఆయా సంఘాల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు చెప్తుండటం ఆసక్తికరంగా మారింది.
రిజర్వేషన్ల స్థిరీకరణతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేసేందుకు సర్వేలో సేకరించే వివరాలు, తద్వారా రూపొందించే నివేదిక కీలకమని, ఆయా వివరాల సేకరణే సక్రమంగా కొనసాగనప్పుడు కచ్చితమైన నివేదిక ఎలా వస్తుందని? మరికొన్ని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. లోపాలను ఆదిలోనే ఎత్తిచూపకుండా, అంతా అయ్యాక కోర్టులో తేల్చుకుందామనడమేమిటని నిలదీస్తున్నారు.
రెండువర్గాలుగా చీలిపోయిన కులసంఘాల తీరుపై సామాజికవేత్తలు అసహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునూ తప్పుబడుతున్నారు. అధికార యంత్రాంగం రూపొందించిన ప్రశ్నావళితో, నిర్దేశించిన నియమ, నిబంధనలతో కుల సర్వేను నిర్వహించవద్దని, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలను రూపొందించి, అవసరమైతే వారి నుంచే ప్రశ్నలను స్వీకరించి ప్రశ్నావళిని తయారు చేసి ప్రజా కులగణన చేపట్టాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సూచించినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐక్యతను ప్రదర్శించి, సర్వేను శాస్త్రీయంగా, లోపరహితంగా కొనసాగేందుకు కృషి చేయాల్సిన కులసంఘాలు రెండుగా చీలిపోవడంపై పలువురు సామాజికవేత్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.