Free Bus Effect | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాజకీయాలకు అతీతంగా సీఎం రేవంత్‌రెడ్డి తమ ఆకలికేకలు తీర్చాలని పలువురు ఆటో డ్రైవర్లు కోరారు. మహిళలకు ఉచిత ప్రయాణం తమకు జీవన్మరణ సమస్యగా మారిందని, తమ బతుకుపోరాటాన్ని గుర్తించి ప్రతి ఆటోడ్రైవర్‌కు నెలకు రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని విన్నవించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బీఆర్టీయూ, టీఏటీయూ అనుబంధ సంఘాల ఆటోడ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చర్చ ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆయా అనుబంధ యూనియన్ల నాయకులు, ఆటోడ్రైవర్లు భారీగా హాజరై.. తమ సమస్యలు వెలిబుచ్చారు.
కాంగ్రెస్ పాలనతో తమ బతుకులు రోడ్డునపడితే, తమ ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 సంపాదించుకునే తమకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కనీసం రూ.300 కూడా మిగలటం లేదని వాపోయారు. ఈ చర్చావేదికకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్ల బాధలు వర్ణణాతీతమని అన్నారు. ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఆటోడ్రైవర్‌కు కనీస జీవన భృతి కింద నెలకు రూ.15 వేలు ఇస్తే తప్ప వారు బతికే రోజులు లేవని చెప్పారు. వారి ఆకలి పోరాటాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు అన్నిజిల్లాల్లో ఆటోడ్రైవర్ల స్థితిగతులు తెలుసుకొని, ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు తెలిపేందుకు ఓ కమిటీని నియమించామని వెల్లడించారు. ఇప్పటికే ఆ కమిటీ అన్ని జిల్లాల్లో వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. మరో రెండ్రోజుల్లో కమిటీ నివేదికను కేటీఆర్‌కు సమర్పిస్తామని, ఆ తర్వాత భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని వివరించారు. ఆటోడ్రైవర్లు అధైర్యపడొద్దని, అవసరమైతే సమరశీల పోరాటాలకు సిద్ధంకావాలని, ఆత్మహత్యలు చేసుకోద్దని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లపట్ల రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ప్రయాణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోలు, జీపులు ఇతర ట్రాన్స్‌పోర్టు డ్రైవర్ల ఆదాయం నెలలోనే 75 శాతానికి పడిపోయిందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు చెప్పారు. ఇంటికి వెళ్లేటప్పుడు కూరగాయలు కూడా కొని తీసుకెళ్లలేని దారుణ పరిస్థితుల్లోకి చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లే కాకుం డా ఇతర వాహనాల డ్రైవర్లు సైతం ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న ఏటా రూ.12 వేలు ఎటూ సరిపోదని, వెంటనే నెలకు రూ.15 వేల భృతి ఇచ్చి, సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటన చేపడతామని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. 7న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద వే ల మందితో మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించా రు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని, ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో పలు యూనియన్ల నాయకులు సంజీవ, రమేశ్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వస్తే ఏదో మేలు జరుగుతుందని అనుకుంటే మొదటి దెబ్బ మా ఆటో డ్రైవర్ల మీదే పడింది. ఒక్క దెబ్బకు మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఉదయం ఆరింటికి అడ్డా మీదికి పోయి రోజంతా కష్టపడినా రూ.200 మిగలటం లేదు. ఖర్చులు పెరిగాయి. అప్పులు చేయాల్సి వస్తున్నది. ఇన్నేండ్లు అడగ్గానే అప్పు ఇచ్చినవాళ్లు మా పరిస్థితులు చూసి అప్పు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు. మాకు రూ.15 వేల భృతి ఇవ్వాలి. సంక్షేమ బోర్డును ఏర్పాటు చెయ్యాలి.
– సంతోశ్, ఆలేరు, ఆటో డ్రైవర్
కేసీఆర్ సార్ ఉన్నంతకాలం మేము ఖుషీగానే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలకే మా బతుకులు రోడ్డునపడ్డాయి. ఎంత కాలం అని చర్చల పేరుతో కాలయాపన చేస్తారు? ఇంకా కొన్ని రోజులైతే మాకు దారుణ పరిస్థితులు దాపురిస్తాయి. రైతన్నల్లాగే మేము కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. మా సమస్యను అంచనా వేయండి. అధికారులతో మాట్లాడండి. రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వచ్చే దగ్గర రూ.300 కూడా రావడం లేదు. మా భార్యాబిడ్డలు ఎలా బతకాలి? అయ్యా రేవంత్‌రెడ్డి గారు.. రాష్ట్రంలో 8 లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉన్నారు. వారికీ కుటుంబాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు దయ చూపకపోతే రానున్న రోజుల్లో చాలా ఎన్నికలు ఉన్నాయి. మా సత్తా చూపిస్తాం.
– దొంతుల శ్రీనివాస్, హైదరాబాద్, ఆటో డ్రైవర్
ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చినట్టు మహిళలకు టీఎస్ ఆర్టీసీ ఉచిత ప్రయాణం మా చావుకొచ్చింది. ఉచిత ప్రయాణం ఆలోచన మంచిదే అయినా, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తే బాగుండేది. మేము కూడా సంతోషించేవాళ్లం. ఇప్పుడు ఎవరూ ఆటోలల్ల ఎక్కడం లేదు. దీంతో కనీసం కూలి గిట్టక ఇంటిల్లిపాది ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా ఎన్నిరోజులు చర్చిస్తారు సార్? మా పేదల కడుపుకొట్టడం మీకు న్యాయమేనా? మా ఆకలికేకలు వినకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారు. అవసరమైతే మిలిటెంట్ ఉద్యమాలకు కూడా వెనుకాడం. అంతా ఏకపక్షంగా పోరాడతాం.
– ఆటో శంకర్, అంబర్‌పేట