హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణన, రిజర్వేషన్ల కోసం ఎంతగానో పోరాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎంపీ రఘునందన్‌రావు విమర్శలు సిగ్గుచేటని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై వారి వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు బీసీల అభ్యన్నతికి ఏనాడూ పనిచేయలేదని పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటున్న ప్రధాని మోడీ బీసీ గణనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిందని ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. తనలాంటి బీసీలకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని స్పష్టంచేశారు. బీసీల కోసం పోరాడుతున్న కవితకు బీసీలంతా మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు.