హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దురాగతాలను ప్రశ్నించే వారిపై రేవంత్‌రెడ్డి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తున్నదని, విచారణ పేరిట అడ్డగోలుగా వేధిస్తున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు. 9 రోజుల్లో తనకు నాలుగుసార్లు నోటీసులివ్వడం కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపునకు నిదర్శనమని, ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) ప్రోద్బలంతోనే జరుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి కేసులో ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరయ్యాయని, తొలిరోజు అడిగిన 66 ప్రశ్నలకు సమాధానమిచ్చానని స్పష్టం చేశారు. అయినప్పటికీ రెండోసారి, మూడోసారి విచారణకు పిలిచి పొద్దంతా ఠాణాల్లో కూర్చుబెట్టి పంపించారని మండిపడ్డారు. మళ్లీ బుధవారం విచారణకు రావాలని నాలుగోసారి పిలవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సర్కారు తప్పులను ప్రశ్నించినందుకు తనపై 21 అక్రమ కేసులు బనాయించిన పోలీసులు.. మంగళవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారని, వారిచ్చిన నోటీసులను చూస్తే ఆశ్చర్యమేసిందని తెలిపారు. నిరుడు మార్చి 31న గాంధీభవన్‌లో వైస్ ప్రెసిడెంట్ కుమార్‌రావు వేసిన కేసులో ఏడాది తర్వాత నిద్రలేచి నోటీసులు ఇవ్వడం సర్కారు దుర్మార్గాలకు పరాకాష్ట అని నిప్పులు చెరిగారు.
ఫ్రాడ్ కంపెనీతో ఒప్పదంపై పోస్టులు పెట్టడం తప్పా?
‘ఊరూ పేరూ లేని అక్రమ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పా? గతంలో ఆ కంపెనీకి ఏపీలో 60 ఎకరాలు ఇచ్చారనే సాకుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తుంటే ఊరుకోవాలా? గ్రూప్-1లో జరిగిన అవకతవకలను ఆధారాలతో ఎత్తిచూపితే చట్ట ఉల్లంఘన అవుతుందా?’ అని క్రిశాంక్ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపబోమని తేల్చి చెప్పారు. పోలీసులు ఇస్తున్న నోటీసుల్లో నిజాయతీ ఉండటంలేదని, బీఎన్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఐపీఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. నోటీసుల్లోనూ సోషల్ మీడియాకు బదులు ‘సోడా మీడియా’ అని రాయడం చూస్తే సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే అక్రమ కేసులు నమోదవుతునట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.
రజతోత్సవాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు
ఈ నెల 27న ఎల్కతుర్తిలో అట్టహాసంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవాన్ని భగ్నం చేసేందుకు సర్కారు కుట్రలు పన్నుతున్నదని, ఆ సభ ఏర్పాట్లలో నిమగ్నమైన తనలాంటి అనేకమంది నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నదని క్రిశాంక్ ధ్వజమెత్తారు. చట్టాన్ని గౌరవించి ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరయ్యానని, నాలుగోసారి ఎట్టిపరిస్థితుల్లో వెళ్లేదిలేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టినా ఖాతరు చేయబోనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాల గొంతునొక్కడం ఆపి ప్రజాసమస్యల పరిష్కారం, పథకాల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.