సంగారెడ్డి, మే 9 (నమస్తే తెలంగాణ) : ‘అక్రమ కేసులు, అరెస్ట్‌లు భయపెట్టలేవు.. మా అధినేత కేసీఆర్ పోరాటం నేర్పించారు.. మేం కేసీఆర్ శిష్యులం.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తూనే ఉంటాను.. జైలులో వేసినా భయపడను.. రేవంత్‌రెడ్డీ ఆయామ్ బ్యాక్ టు క్వశ్చన్’ అంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. అక్రమ కేసుల్లో అరెస్టయి సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న మన్నె క్రిశాంక్ శనివారం ఉదయం బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి వెలుపలికి వచ్చిన ఆయనకు కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న సమయంలో తనను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైలులో వేస్తే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ తనకు పూర్తిగా అండగా నిలిచిందని చెప్పారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ పోరాటం వల్లే తనకు బెయిల్ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు దిగజారుతున్నదని, ప్రజలకు మేలు చేయాలన్న విజన్ లేదని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాను పోలీసుల ద్వారా కట్టడి చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా వింగ్ ప్రతినిధుల ఫోన్లు, వైఫైలు హ్యాకింగ్ చేస్తున్నదని ఆరోపించారు. నిర్మల్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తన ఫోన్‌కాల్ హిస్టరీ ముందు ఉంచి తనను ప్రశ్నించినట్టు గుర్తుచేశారు. తన మొబైల్, వైఫై, ఈమెయిల్ పాస్వర్డ్లు కావాలని పోలీసులు ఒత్తిడి చేసినట్టు తెలిపారు. సీఎంవో నుంచి క్వశ్చన్ పేపర్ వస్తే పోలీసు అధికారులు వాటిపైనే తనను ప్రశ్నించినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
సీఎం శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టి జైలులో వేసినట్టు క్రిశాంక్ మీడియాతో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను నేరప్రవృత్తి ఉన్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రయ త్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల నరికవేతపై ప్రశ్నిస్తే కేసు, ఓయూలో నీటికొరత, కరెంటు కోతలపై ప్రశ్నిస్తే కేసు, అంగన్వాడీ మహిళలకు మొబైల్ ఫోన్ పంపిణీలో స్కామ్‌పై ప్రశ్నిస్తే కేసు, రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్‌పై ప్రశ్నిస్తే కేసు, సోమ్ డిస్ట్రలరీస్, మూసీ కాంట్రాక్టులపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిందని వెల్లడించారు. ఈ కేసులు, సెక్షన్లను చూసి న్యాయమూర్తులే ఆశ్చర్యపోయారని చెప్పారు. పదేళ్ల శిక్ష పడే కేసు తనపై పెడితే కూకట్పల్లి మెజిస్ట్రేట్ ఆ సెక్షన్‌ను స్వయంగా తప్పించినట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టడిపై పెడుతున్న శ్రద్ధ్ద రాష్ట్రంలో శాంతిభద్రతల రక్షణపై పెట్టాలని సూచించారు.
వెలమ్ బ్యాక్ క్రిశాంక్! ఎక్స్ వేదికగా కేటీఆర్
సంగారెడ్డి జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు శనివారం ఎక్స్ వేదికగా ఆత్మీయ స్వాగతం పలికారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై గళమెత్తినందుకు అక్రమంగా జైలులో పెట్టినా, నీ సంకల్పం ఇంచు కూడా తగ్గలేదు. ప్రతిరోజూ నీ నిబద్ధతను మరింత దృఢపరిచిందని మా నమ్మకం. నీ పోరాటం కొనసాగాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.