హైదరాబాద్ : కడుపు కట్టుకుని హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. ఇప్పుడు నన్ను కోసుకుతిన్నా పైసలు లేవని సీఎం అంటున్నారు . సీఎం సకుటుంబ సపరివారాన్ని కోస్తే పైసలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ నేత డాక్టర్ మన్నె క్రిశాంక్(Manne Krishank) అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు. షాడో సీఎంగా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వ్యవహరిస్తున్నారు. కొండల్ రెడ్డి ఫోర్త్ సిటీలో బిజీగా ఉన్నారు. అమెరికా వరకు సీఎం వెళ్లి సొంత తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.
ఇప్పటివరకు ఒక్క పైసా అయినా పెట్టుబడులు పెట్టారా లేదా అని క్లారిటీ లేదన్నారు. రెండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ యాడ్స్ అన్ని రేవంత్ రెడ్డి మరో సోదరుడు కృష్ణారెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. యాడ్స్ రూపంలో పోతున్న డబ్బులన్నీ రేవంత్ రెడ్డి సోదరుడి ఖాతాలోకి వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసం లగచర్లలో గిరిజన రైతులపై లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు యాడ్స్..
రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు కట్టబెట్టారు. సృజన్ రెడ్డికి చెందిన యశోదా కంపెనీకి సింగరేణి కాంట్రాక్టులు అప్పగించారు. కాంగ్రెస్ కు అనుబందంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు తెలంగాణ నుండి యాడ్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. 1,137 కోట్ల కాంట్రాక్టు యశోదా కంపెనీకి ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తిరిగిన ల్యాండ్ క్రూయిజర్ కారు కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద ఉంది. ఇప్పుడు అదే కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు రూ.320 కోట్ల
కాంట్రాక్టు రేవంత్ రెడ్డి ఇచ్చారన్నారు. పాలేరులో రూ.200 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. వందల కోట్ల కాంట్రాక్టులు కుటుంబానికి, మిత్రులకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీకి పోతే దొంగల్లా చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు దొంగలు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులని ఘాటుగా విర్శరించారు.
అన్ని శాఖల్లో సీఎం వేలు పెట్టారు
రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీపై ఏ.ఐ.సి.సి ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. మంత్రుల అన్ని శాఖల్లో సీఎం రేవంత్ రెడ్డి వేలు పెట్టారు . ఐటీ శాఖ మంత్రి సలహా తీసుకోకుండా ఇంటర్ నెట్ కేబుల్స్ కట్ చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందన్నారు. తెలంగాణ సమాజం విద్యార్థులు, యువత, రైతులు రోడ్ల మీద ఉన్నారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి సృజన్ రెడ్డి అల్లుడు. కందాల ఉపేందర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారా? సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డి బామ్మర్దిగా కాంట్రాక్టులు వచ్చాయి. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యునిగా సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు వచ్చాయి. సృజన్ రెడ్డికి జైపాల్ రెడ్డి కుటుంబానికి సంబంధం లేదా అనే విషయం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. సృజన్ రెడ్డిని తప్పించడం కోసం మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పేరు వాడుతున్నారని అన్నారు.