హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : భ్రమర ఇన్ఫ్రా కంపెనీపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నచిన్న విషయాలపై సిట్ విచారణ అంటూ ఊదరగొట్టే రేవంత్ సర్కార్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆగడాలపై మాత్రం ఎందుకు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో విజయుడు, క్రిశాంక్ మాట్లాడారు.
సంపత్‌కుమార్ అరాచకంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ది పీడించే పాలన అని దుయ్యబట్టారు. నేషనల్ హైవే44 పనుల్లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని రూ.8 కోట్లు ఇవ్వకుంటే పనులు ఎలా జరుగుతాయో చూస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని, ఆయన మారణాయుధాలతో బెదిరించినట్టు బాధిత సంస్థ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినా ప్రభుత్వం సంపత్‌కుమార్‌పై చర్యలకు వెనకాడుతోందని విమర్శించారు. ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు బాధితులే పేర్కొన్నా, సంపత్‌కుమార్ పేరును ప్రధానంగా ప్రస్తావించినా ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయకుండా తాత్సరం చేస్తున్నాదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని, అవసరమైన ఆధారాలను తాము అందజేస్తామని వారు ప్రకటించారు.
విచారణను నిష్పక్షపాతంగా జరిపి ప్రభుత్వం తన ప్రతిష్టను నిరూపించుకోని బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. తనను ముట్టుకుంటే అగ్గి అవుతారన్న సంపత్‌కుమార్ ఇప్పుడు మట్టి దందాతో మాత్రం రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల మీద సిట్ వేసిన కాంగ్రెస్ సర్కారు సంపత్ అక్రమాలు, మట్టిదందాలు, మండలస్థాయి అధికారులను సైతం వదలని వ్యవహారాలపై మాత్రం మౌనమెందుకు వహిస్తున్నదో చెప్పాలని నిలదీశారు. అఫిడవిట్లో భూములు లేవని చూపెట్టి, ఇప్పుడు మాత్రం రెండెకరాల అసైన్డ్ భూమిని కుటుంబ సభ్యులపేరా ఎలా చేశారో చెప్పాలన్నారు.
సంపత్‌కుమార్ అరాచకాలకు సంబంధించిన ఆధారాలన్ని తమ వద్ద ఉన్నాయని, సమయం చూసి అన్నీ బయటపెడుతామని హెచ్చరించారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు కబ్జా వ్యవహారంపై చర్యలెందుకు లేవని, మంత్రి కూతురు ఓపెన్‌గా మాట్లాడినా ఇప్పటికీ కేసు ఎందుకు నమోదు కాలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కప్పెట్టిన నిజాలన్నీ బయటకు రావాలంటే సిట్ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని సవాల్ విసిరారు. అసలు కాంగ్రెస్ పాలనలో కమీషన్ల దందా సాగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నగర కమిషనర్ సజ్జనార్ కూడా వారికి వంతపాడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
