హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా భారీ వర్షాలకు నగర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వానాకాల సీజన్లో సవాళ్లను ఎదుర్కొవడంలో సర్కారు పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు వర్షాకాల సీజన్లో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ఎప్పుడూ ఢిల్లీ పర్యటనల్లోనే మునిగిపోయే సీఎంకు నగర ప్రజలు కష్టాలు తెలియడం లేదని దుయ్యబట్టారు. నిరుడు బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ వాతావరణశాఖ జారీచేసే హెచ్చరికలకు అనుగుణంగా అధికారులను అప్రమత్తం చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా మాన్సూన్, క్లౌడ్బరస్ట్లపై అధికారులను సన్నద్ధం చేసి.. తగిన చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీస బాధ్యతను కూడా నిర్వర్తించకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.