హైదరాబాద్ : రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు అందరి అటెన్షన్ కోసం రకరకాల అబద్దాలు ఆడారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లకు కేసీఆర్, కేటీఆర్‌లతో సంబంధాలను రేవంత్ రెడ్డి అంటగట్టే వారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్(Krishank) విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ద్వంద వైఖరిపై నిప్పులు చెరిగారు. తమ బంధువులకు, తెలంగాణ ద్రోహులకు కేసీఆర్, కేటీఆర్ కాంట్రాక్టులు కట్టబెట్టారని రేవంత్ ఆరోపించేవారు.ఈ అంశాలపైనే కొన్ని డజన్ల ప్రెస్ మీట్లు పెట్టారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపించిన వారికే రేవంత్ ఇపుడు కాంట్రాక్టులు కట్టబెడుతున్నాడని మండిపడ్డారు. కేసీ పుల్లయ్య అనే కంపెనీ పొద్దుటూరు వారిది అని అరడజను సార్లు ప్రెస్ మీట్ పెట్టారని గుర్తు చేశారు. కేసీ పుల్లయ్య ప్రాజెక్టు కేటీఆర్‌ను కలిశాక కేపీసీ ప్రాజెక్టుగా మారింది అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేపీసీ ప్రాజెక్టు అధినేత అనిల్ కుమార్ శెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో సన్నిహితంగా ఉన్నారు. కేటీఆర్ కు సన్నిహితుడైతే రేవంత్ రెడ్డి కేపీసీకి ఎందుకు 400 కోట్ల ప్రాజెక్టు ఎందుకు ఇచ్చారు ? అని ప్రశ్నించారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
తిరుపతి రెడ్డికి దగ్గరైనందుకే కేటీపీఎస్ 400 కోట్ల ప్రాజెక్టు కేపీసీకి దక్కిందా? అని నిలదీశారు. గతంలో ఫీనిక్స్కు, కేటీఆర్‌కు ఉత్తమ్ సంబధాలను అంటగట్టారు. అదే ఫీనిక్స్ వాళ్లు రేవంత్‌తో ఇపుడు అంట కాగుతున్నారని రేవంత్ రెండు నాల్కల ధోరణిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి పాత స్క్రిప్ట్ ను కవిత తిరగదోడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం, అమర జ్యోతి ప్రాజెక్టుల్లో అవినీతి గురించి మాట్లాడారు.
దమ్ముంటే విచారణ జరపాలి
రేవంత్‌కు వకాల్తా పుచ్చుకుంటున్న వారు కూడా తప్పుడు ఆరోపణలపై ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌లపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు. అప్పుడు రేవంత్ చేసిన ఆరోపణలపై దమ్ముంటే విచారణ జరపాలని సవాల్ విసిరారు. లేదా ఆరోపణలు చేసిన వారికే రేవంత్ రెడ్డి ఇప్పుడడు కాంట్రాక్టులు ఇస్తున్నందుకు నాడు నిరాధార ఆరోపణలు చేశానని ఒప్పుకోవాలని సూచించారు.