హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం తెలంగాణ రాష్ర్టాన్ని లూటీ చేస్తున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం అభిలాశ్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి షాడో సీఎంలా వ్యవహరిస్తూ దందాలు నడుపుతున్నారని, కొండాల్‌రెడ్డి ఫోర్త్‌సిటీ పనుల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. నిరుటి ఆగస్టులో దావోస్ వెళ్లిన సీఎం ఎలాంటి అర్హత లేని తన తమ్ముడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన కంపెనీతో రూ.1,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. మరో సోదరుడు కృష్ణారెడ్డి యాడ్స్ కాంట్రాక్ట్ పేరిట ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్‌కు కోట్లాది రూపాయలను యాడ్స్ రూపంలో కట్టబెడుతున్నారని తెలిపారు.
సీఎం అల్లుడు సత్యనారాయణరెడ్డి కోసం లగచర్లలో గిరిజన రైతులపై సర్కారు దాష్టీకానికి దిగిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన కంపెనీ శోధాకు రూ.1,137 కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారని, తాజాగా సింగరేణిలో రూ.150 కోట్లు , డిండి ప్రాజెక్టుకు సంబంధించి రూ.365 కోట్లు మొత్తంగా కలిపి రూ.2 వేల కోట్ల మేర కాంట్రాక్టులను అప్పగించారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తిరిగిన ల్యాండ్ క్రూయిజర్ కారు యాజమానికి చెందిన కేఎల్ఎస్సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి రూ.320 కోట్ల టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. 20 నెలల పాలనలో రేవంత్‌రెడ్డి కుటుంబం ప్రజల దృష్టిని మళ్లించి యథేచ్ఛగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నదని మండిపడ్డారు. రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే రేవంత్‌రెడ్డి బ్రదర్స్ మాత్రం కాంట్రాక్టుల పంపకంలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు.