Manne Krishank | ఏఐసీసీ నేత సంపత్ కుమార్ ప్రెస్మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. సంపత్ కుమార్ చేసింది మొత్తం మట్టి దందాలే అని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ భ్రమర కాంట్రాక్టర్లును బెదిరించి రూ.8 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. దీనిపై శ్రీ భ్రమర కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారని.. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
మారణాయుధాలతో తమను బెదిరించారని శ్రీభ్రమర కాంట్రాక్టర్లు ఫిర్యాదులో పేర్కొన్నారని మన్నె క్రిశాంక్ తెలిపారు. కాంట్రాక్టులు రావాలంటే రూ.8కోట్లు ఇచ్చుకోవాలని బెదిరించారని తమ ఫిర్యాదులో వివరించారని పేర్కొన్నారు. సంపత్ అక్రమాలపై వెంటనే సిట్ విచారణ ప్రకటించాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో సంపత్ కుమార్ అన్నీ తప్పులే సమర్పించారని తెలిపారు. భూముల వివరాలపై తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పేర్కొన్నారు. అసైన్డ్ భూములను సంపత్ కుమార్ తన సతీమణిపై రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. సంపత్ కుమార్ అబ్బాయి అక్రమ కంపెనీ గ్లోబెన్ ఇండస్ట్రీస్‌కి డైరెక్టర్‌గా ఉన్నాడని అన్నారు. అక్రమ కంపెనీలతో కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారని ఆరోపించారు. గ్లోబెన్ ఇండస్ట్రీస్‌కే అన్ని కాంట్రాక్టులు ఎందుకు వెళ్తున్నాయని ప్రశ్నించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అక్రమాలకే పాల్పడుతున్నారని క్రిశాంక్ తెలిపారు. వంద పడకల ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. మీడియా చానళ్లపై వేసిన సిట్‌లో సజ్జనార్‌ను పెడతారా? ఇంకో అధికారిని పెడతారా అని ప్రశ్నించారు. ఆ సిట్‌కు సంపత్ కుమార్ బెదిరింపు ఆడియో టేప్‌లను అందజేస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల వివరాలను వెబ్సైట్లలో ఎందుకు పెట్టడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు. సంపత్ కుమార్ ఓకే అంటేనే కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తున్నారని అన్నారు. ఉద్యోగాల లిస్ట్ ఎందుకు సంపత్ కుమార్ దగ్గరకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువత సంపత్ కుమార్ అక్రమాలపై ఆలోచించాలని సూచించారు. సంపత్ కుమార్ క్విడ్ ప్రోకోలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇసుక, మట్టి దందాలపై విచారణ జరగాలన్నారు. సంపత్ కుమార్‌పై విచారణ జరిపించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని అడిగారు. సంపత్ కుమార్ అక్రమాలపై విచారణకు రేవంత్ రెడ్డి రెడీనా అని సవాలు విసిరారు.