ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వ్యక్తులపట్ల తెలంగాణ సమాజం ఎంతటి కృతజ్ఞతాభావంతో ఉంటుందో చెప్పడానికి.. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ అర్పించిన ఘన నివాళి ఓ ఉదాహరణ. తెలంగాణ సుదీర్ఘ పోరాటం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ ఉద్యమంగా మారి మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో స్వరాష్ట్ర కల సాకారమైంది. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మన్మోహన్ సంపూర్ణ సహకారం అందించారు.మద్దతుతోపాటు మార్గనిర్దేశనమూ చేశారు. దారి చూపిన దార్శనికుడిగా ఆయనకు తెలంగాణ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని భావించిన కేసీఆర్.. బీఆర్ఎస్ తరఫున ఘన నివాళులర్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎంపీల బృందం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించింది. ‘ఆధునిక భారత నిర్మాత’ అంటూ ఘన నివాళులర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని మననం చేసుకున్నది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం జరిగే మాజీ ప్రధాని అంత్యక్రియలకూ బీఆర్ఎస్ నేతలు హాజరుకానున్నారు.
Manmohan Singh | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కోట్లాది మంది ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి.. ఉద్యమానికి బాసటగా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలంగాణ సమాజం పక్షాన బీఆర్ఎస్ కృతజ్ఞతాపూర్వక నివాళులర్పిస్తున్నది. ఇందిరాగాంధీ హయాంలోనూ నెరవేరని ఈ ప్రాంత ప్రజల కల మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయ ఉద్యమంగా మారి పార్లమెంటరీ విధానంలో విజయం సాధించింది. ఆ చారిత్రక సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నది మన్మోహన్సింగ్. తెలంగాణ ఏర్పాటుకు నాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ ఉద్యమ నేత కేసీఆర్‌కు పూర్తి సహకారం అందించారు. అలాంటి నేతకు యావత్ తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని భావించిన కేసీఆర్, తెలంగాణ సమాజం తరఫున కృతజ్ఞతను చాటుకోవాలని నిర్ణయించి ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించేందుకు బీఆర్ఎస్ బృందాన్ని ఢిల్లీకి పంపారు. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర తదితర సీనియర్ నేతలు శుక్రవారం ఢిల్లీకి వెళ్లి మన్మోహన్సింగ్ పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మన్మోహన్ సహకారం మరువలేం: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘దేశ ఆర్థిక సంసరణల ఆరిటెక్టుగా మన్మోహన్సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారు. ఆయనకు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉన్నది. వారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధమున్నది. వారెంతో స్థిత ప్రజ్ఞత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారందించిన సహకారం మరువలేను. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్‌సింగ్‌కు ఘన నివాళులర్పించాలని నిర్ణయించి వారి కడసారి వీడోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్‌ను, ఎంపీలను ఆదేశించిన’ అని కేసీఆర్ వివరించారు.
2004 తొలినాళ్లలోనే..
తెలంగాణ ఉద్యమ స్వరూపం.. స్వభావాలను, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకాకుంటే ఈ ప్రాంతానికి కలిగే నష్టాలు, ఇతర పరిణామాలను కేసీఆర్ 2004 తొలినాళ్లలోనే నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు. 1971లో తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని 11 మంది తెలంగాణ ప్రజాసమితి ఎంపీలను కాంగ్రెస్‌లో విలీనం చేసుకొని ఉద్యమాన్ని అణచివేసిన చరిత్ర నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్నదని, ఆ పొరపాటును మళ్లీ చేయకూడదని కేసీఆర్ పదే పదే నాటి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ విషయంలో తాము చేసిన తప్పును మన్మోహన్ సరిదిద్దారని తెలంగాణ ఏర్పాటు తొలినాళ్లల్లో అనేక మంది కాంగ్రెస్ నేతలు సై తం బహిరంగంగా చెప్పిన సందర్భాలున్నాయి.
కేసీఆర్ సంకల్పానికి ముగ్ధుడైన మన్మోహన్
దశాబ్దాలుగా తెలంగాణపై కొనసాగిన అణచివేత, ఆర్థిక దోపిడీ, సామాజిక, సాంస్కృతిక వివక్ష తెలిసిన అతికొద్ది మంది జాతీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ముందు వరుసలో ఉంటారు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు ఫలితంగా ఇటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్, ఆలె నరేంద్ర, బోయినపల్లి వినోద్‌కుమార్, రవీంద్రనాయక్, మధుసూదన్‌రెడ్డి ఐదుగురు ఎంపీలుగా గెలిచారు. పొత్తులో భాగంగా బీఆర్ఎస్కు రెండు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. కేసీఆర్‌కు షిప్పింగ్, ఆలె నరేంద్రకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలు దక్కాయి. నాటి యూపీఏ మిత్రపక్షమైన డీఎంకే షిప్పింగ్ మంత్రిత్వశాఖ కావాలని పట్టుబట్టింది. కేసీఆర్‌కు ముందుగా కేటాయించిన షిప్పింగ్ శాఖను ఎలా తీసుకోవడమన్న మీమాంసలో కేంద్రం పడింది. ‘ఈ విషయాన్ని కేసీఆర్‌కు ఎలా చేరవేయాలి? పొత్తు ధర్మంలో భాగంగా కేటాయించిన శాఖను తిరిగి ఇవ్వాలని ఎలా అడగాలి’ అన్న సందిగ్ధంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదనే విషయం తెలుసుకున్న కేసీఆర్ తానే స్వయంగా మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ వద్దకు వెళ్లి ‘నేను కేంద్ర మంత్రి పదవి కోసం ఢిల్లీకి రాలేదు.
నాక్కావాల్సింది తెలంగాణ ఏర్పాటు. అందుకు మీరు గట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు నాకు కేటాయించిన శాఖతో తెలంగాణకు పనేలేదు. అవసరం ఉన్నవారికి, ఆ శాఖను కోరుకుంటున్నవారికి ఇవ్వండి. నాకు మాత్రం తెలంగాణ విషయంలో స్పష్టత ఇవ్వండి. నాకు ఏ శాఖా కూడా ఇవ్వకపోయినా మంచిదే’ అని కేసీఆర్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు కేసీఆర్‌కు కేటాయించిన శాఖను డీఎంకేకు ఇవ్వడంతో చాలా కాలం కేసీఆర్ ఏ శాఖ కూడా లేని మంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణకు చోటు, జూన్ 7, 2004లో పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం, ఆ తర్వాత జూలైలో విజ్ఞానభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉన్నదని ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించడం దాకా ప్రతి సందర్భంలో కేసీఆర్‌లో ఉన్న సంకల్పానికి మన్మోహన్సింగ్ ముగ్ధులయ్యారు.
తెలంగాణతో మన్మోహన్‌కు వీడదీయలేని అనుబంధం
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలంగాణతో విడదీయరాని అనుబంధం ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం కంతనపల్లి గ్రామం గోదావరి వరద ముంపునకు గురైనప్పుడు 1987, ఏప్రిల్ 24న నాటి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా ఉన్న మన్మోహన్సింగ్ ఆ గ్రామానికి వచ్చి వరద బాధితుల కోసం నిర్మించిన కంతనపల్లి పునరావాస కాలనీని ప్రారంభించారు. ఆ గ్రామంలో ఇప్పటికీ ఆయన ప్రారంభించిన శిలాఫలకం ఉన్నది. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ జయశంకర్ ఉన్న సమయంలో 1992లో వర్సిటీ స్నాతకోత్సవంలో మన్మోహన్సింగ్ ‘యు టర్న్ ఇన్ ఇండియన్ ఎకానమీ’ అనే అంశంపై స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. 2003లో వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ జైత్రయాత్ర బహిరంగ సభ ద్వారా బలంగా ప్రజ్వరిల్లిన తెలంగాణ ఆకాంక్ష, జాతీయ రాజకీయాలను ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయం గా తెలంగాణ ప్రాంతమంతా అప్రతిహత చైతన్యస్రవంతిని విస్తరింపజేస్తున్న టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోక తప్పని అనివార్యతను కేసీఆర్ సృష్టించారు. అప్పటి నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర కల సాకారమయ్యేదాకా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండటం విశేషం.
నేను కేంద్ర మంత్రి పదవి కోసం ఢిల్లీకి రాలేదు. నాక్కావలసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. అందుకు మీరు గట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు నాకు కేటాయించిన శాఖతో తెలంగాణకు పనేలేదు. అవసరం ఉన్నవారికి, ఆ శాఖను కోరుకుంటున్నవారికి ఇవ్వండి. నాకు మాత్రం తెలంగాణ విషయంలో స్పష్టత ఇవ్వండి. నాకే శాఖ ఇవ్వకపోయినా మంచిదే..
– మన్మోహన్సింగ్, సోనియాగాంధీతో కేసీఆర్ (2004)
దేశంలో పాలనా అనుభవం ఉన్న పెద్ద రాష్ర్టాలకు పాఠాలు చెప్పే ప్రయోగశాలగా తెలంగాణ ఎదిగినందుకు సంతోషంగా ఉన్నది. తెలంగాణను కేసీఆర్ ఆ రకంగా మలిచి తన ప్రేమను నిరూపించుకున్నారు.
– పలు సందర్భాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
మహోన్నత వ్యక్తి మన్మోహన్: నామ
మన్మోహన్సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరనిలోటని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటులో కీలకం: వినోద్
మన్మోహన్సింగ్ సేవలు చిరస్మరణీయమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్‌గా దేశ అభివృద్ధికి కృషిచేశారని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంలో కీలకభూమిక పోషించారని గుర్తుచేశారు.
దేశాభివృద్ధిలో కీలకపాత్ర: వేముల
ప్రధానిగా మన్మోహన్సింగ్ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంసరణలను అమలుచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని పేర్కొన్నారు.
దేశానికి తీరనిలోటు: నిరంజన్‌రెడ్డి
దివంగత ప్రధాని పీవీ తెచ్చిన ఆర్థిక సంసరణల అమలులో మన్మోహన్ సింగ్ తన వంతు పాత్ర పోషించారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు.
భావితరాలకు స్ఫూర్తి: బండా ప్రకాశ్
దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన ఆర్థిక నిపుణుడు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ భావితరాలకు స్ఫూర్తి అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తెలిపారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయనతో పలు అంశాలపై చర్చించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
అసమాన ఆర్థికవేత్త: రావుల
అసమాన ఆర్థికవేత్తను, పరిపాలనధక్షుడిని దేశం కోల్పోయిందని మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మన్మోహన్సింగ్ చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
ఆర్థిక సంసర్త : దేవీప్రసాద్
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమనేత కేసీఆర్‌తో కలిసి మన్మోహన్‌ను కలవడం మరువలేనిదని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు.
గొప్ప రాజనీతిజ్ఞుడు: దాసోజు
దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మనోహ్మన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మన్మోహన్‌కు సీఎం రేవంత్ నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. శుక్రవారం ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. రేవంత్ వెంట కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహా, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
దేశానికి తీరని లోటు: కిషన్‌రెడ్డి
మన్మోహన్సింగ్ మరణం దేశానికి తీరని లోటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన నిరాడంబర జీవితం, దేశం పట్ల అంకితభావం భావితరాలకు స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు.