హైదరాబాద్: మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని చెప్పారు. మన్మోహన్ సింగ్ హాయాంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్‌ను కేసీఆర్ కోరారని గుర్తుచేశారు. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దివంగత మాజీ ప్రధాని మాన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి బీఆర్ఎస్ తరఫున పూర్తిగా మద్దతిస్తున్నాం. మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం.
మన్మోహన్ సింగ్ గొప్పదనాన్ని, సామర్థ్యాన్ని మొదటిసారిగా గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహా రావు అనేది నిర్వివాదాంశం. పీవీ నరసింహా రావు దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత లాటరీ ఎంట్రీ ద్వారా రాజకీయాలతో సంబంధ లేని ఒక ఆర్థిక వేత్తను ఫైనాన్స్ మినిస్టర్‌గా నియమించారు. 1991లో బడ్జెట్ ప్రవేశపెడుతూ ‘ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది. నా దేశం మేల్కొని ఉంది..’ అంటూ ఆర్థిక వేత్తగా సంస్కరణలను ప్రవేశపెట్టే సందర్భంగా మాట్లాడారు. ఆ మాటలు.. ఆయన సిద్దాంతం, పీవీ నరసింహారావు నాయకత్వం నేడు దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కేవలం 15 రోజులు ఫారెక్స్ నిల్వలు ఉన్న నాటి రోజు నుంచి ప్రపంచమంతా ఆశ్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థిక సంస్కరణల శీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. అనవసరపు డాంభికాలు, ఆర్భాటాలు, హడావుడి లేకుండా సింపుల్ లివింగ్.. హై థింకింగ్ అనే మాటకు పర్యాయపదంగా మన్మోహన్ సింగ్‌ను మనం చెప్పుకోవచ్చు. విశ్వాసం అనే నేటి రాజకీయాల్లో అరుదైన పదం. తనకు అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలందించిన మహానుభావుడు. ఆర్థికమంత్రిగా, తర్వాత ప్రధానిగా పనిచేసి, ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన అభ్యుదయ వాది, నిరాడంబర మనిషి మన్మోహన్ సింగ్.
ఆయన ప్రధానిగా ఉన్న కాలంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏడాదిన్నరపాటు కేంద్ర మంత్రిగా పనిచేశారు. నాటి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని గెలుపొందిన తర్వాత భాగస్వామ్య పక్షాలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కేసీఆర్‌కు షిప్పింగ్ మంత్రి పదవి ఇస్తే.. డీఎంకేతో చిక్కుముడి ఏర్పడింది. దీంతో మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి తాను వచ్చింది పదవుల కోసమో, పోర్టుఫోలియోల కోసమో కాదు.. తెలంగాణ కోసమని చెప్పిన కేసీఆర్.. ఆ మంత్రిత్వ శాఖను డీఎంకేకి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏ నిబద్ధతతో వచ్చారో అది ఫలించాలని కోరుకుంటున్నానని కేసీఆర్‌తో మన్మోహన్ అన్నారు. మీరు తీసుకున్న నిర్ణయంతో గుర్తింపు వస్తుందని, కర్మయోగిగా గుర్తించబడతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత.. ఒక గొప్ప ఆలోచనకు అరుదైన సందర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు. అలాగే మన్మోహన్ సింగ్ నమ్మారు కాబట్టే.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత, ఉద్యమానికి ఉన్న బలం, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి.. అన్నీ ఆయనకు అర్ధమయ్యాయి కాబట్టే అనివార్య పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడింది. దానిని తాము మర్చిపోం.
మన్మోహన్ సింగ్ నిబద్ధతను గుర్తుచేసే సందర్భంలో సరిగ్గా ప్రధానిగా వారు ఎన్నికైన తర్వాత ఆరు నెలలకు కేసీఆర్.. క్యాబినెట్ సహచరుడిగా డిసెంబర్ ముఖ్యమైన డెలిగేషన్ తీసుకొస్తున్నానని, తమకు సమయం ఇవ్వాలని కోరారు. బలహీన వర్గాలకు చెందిన నాయకులను తీసుకొస్తున్నానని, తమకు ఐదు నిమిషాలు సరిపోదని 30 నిమిషాలకు కావాలని కోరారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న నాటి ప్రధాని 45 నిమిషాలు సమయమిచ్చారు. ఆయన గొప్పతనమేంటంటే.. కేంద్రంలో ఓబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని ప్రధాని వద్దకు 2004, డిసెంబర్ 18న ఒక బృందాన్ని తీసుకెళ్తే, 45 నిమిషాలు సమయమిచ్చిన మన్మోహన్ సింగ్ గంటన్నరపాటు వారితో గడిపారు.
ఎన్నో అడ్డంకులు, ఎన్నో అభ్యంతరాలున్నా మన్మోహన్ సింగ్ ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. ఎన్నడూ కూడా, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా సంస్కరణల బాట నుంచి వెనక్కి తగ్గలేదు. ఆయన్ని మనం సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అని పిలువవచ్చు. మన్మోహన్ కాదు ఈయన మౌన మోహన్ సింగ్ అని, మౌన ముని అని పేర్లు పెట్టారు. అయితే అవేవీ పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు. విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు. ఎన్ని నిందలు వేసిన మహోన్నతులు వణకరు, బెనకరు. అలాంటి స్థితప్రజ్ఞతను మనం మన్మోహన్ సింగ్‌లో చూశాం.
మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు గురించి కూడా గుర్తుచేసుకోవాలి. కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లి మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించాం. అంత్యక్రియల్లో పాల్గొన్నాం. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించాం. అక్కడికి వెళ్లినప్పుడు మన్మోహన్ సింగ్‌కు జరిగిన గౌరవ ప్రదమైన వీడ్కోలు మన పీవీకి జరుగలేదనే బాధ అనిపించింది. మనవాడైన పీవీ నరసింహా రావుకు కూడా ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేయాలని, తెలంగాణ బిడ్డకు సముచిత గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనే ప్రతిపాదన సభ నుంచి వెళ్తే బాగుంటుంది. ఢిల్లీలో అందరు ప్రధానులకు స్మారకం ఉంది. మన పీవీ నరసింహా రావుకు లేదు. అది మనకు అవమానం, తీరని లోటు. ఈ తీర్మానంతోపాటు దానిని కూడా జతపరిచి పంపించనట్లయితే మన గౌరవం కూడా పెరుగుతుంది. సీఎం ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణ తెలుపుతున్నాం. ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతున్నాం’ అని కేటీఆర్ అన్నారు.
Live: శాసనసభలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి సంతాప తీర్మానం సంధర్భంగా మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS https://t.co/1Dcu7YPEQR
— BRS Party (@BRSparty) December 30, 2024