మెదక్: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమాత ఆలయం (Edupayala Temple) ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగుతున్నది. వరద ఉధృతికి ఆలయంలోకి నీరు చేరింది. గత ఆరు రోజులుగా ఆలయం నీట మునిగే ఉన్నది. ఈనేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో వెల్లడించారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండటంతో మంజీరా నదిలోకి చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టువైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, ఎగువ నుంచి సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 28,181 క్యూసెక్కుల వరద వస్తుండగా 15,114 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది. సింగూరు పూర్తిస్థాయి నీటినిల్వ 29.91 టీఎంసీలు. ఇప్పుడు 28.939 టీఎంసీలు నిల్వ ఉన్నది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.