హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కిసాన్‌సెల్ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా ప్రముఖ రైతు నాయకుడు మాణిక్ కదంను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. మాణిక్ కదం మూడు దశాబ్దాలుగా రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా షేత్కరీ సంఘర్ష్ సమితిని స్థాపించి దాని ద్వారా రైతుల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా రైతులను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపట్టారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, రైతుల సమస్యలను పరిష్కారించాలని అనేక ఉద్యమాలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతు నాయకులు శరద్‌జోషి, రాజుషెట్టి తదితరులతో కలిసి అనేక ఉద్యమాలను నిర్మించిన చరిత్ర మాణిక్ కదంకు ఉన్నది. రైతు సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రలు సైతం చేశారు.
పర్బణికి చెందిన మాణిక్ కదం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, రైతు అనుకూల విధానాలను చూసి బీఆర్ఎస్లో చేరారు. కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమితుడైన సందర్భంగా మాణిక్ కదం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటానని, తెలంగాణ రైతు అనుకూల మాడల్ దేశవ్యాప్తంగా అమలు కావడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రైతు అనుకూల విధానాలను వివరించేందుకు త్వరలో షిర్డీలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణ కార్యక్రమాల తేదీలను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల నుంచి రైతు నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇటీవల నాందేడ్‌లో పర్యటించిన నేపథ్యంలో ఇక్కడి రైతుల్లో ఒక భరోసా వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ రైతు అనుకూల విధానాలపై సానుకూల చర్చ జరుగుతున్నదని తెలిపారు.