వీపనగండ్ల, జూలై 19: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్లిలో రుణమాఫీ సంబురాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ..
రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ఆర్థిక భారం ఉన్నప్పటికీ అర్హులకు రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, గృహజ్యోతి, రూ.500కే సిలిండర్ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. గ్రామంలో ఇండ్లు లేని పేదలను గుర్తించి మెదటి విడతలో 50 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరుచేస్తామని భరోసా ఇచ్చారు.