హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : వరుసగా మరో ఏడాది మామిడి రైతులకు నిరాశే మిగిలేలా కనిపిస్తున్నది. అకాల వర్షాలు, తీవ్రమైన మంచు, చీడపీడలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చెట్ల నిండా పూతతో కనిపించాల్సిన మామిడి తోటలు .. బోసిపోయి కనిపిస్తున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్లో మామిడి పూత వస్తుంది. కానీ ఈసారి ఇప్పటివరకు పూత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పూత కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి మందులు కొడుతున్నారు.
రాష్ట్రంలో నాగర్కర్నూల్, జగిత్యాల, ఖమ్మం,రంగారెడ్డి, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు పెద్దఎత్తున మామిడి సాగు చేస్తున్నారు. తెలంగాణలో 1.23 లక్షల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 50 శాతం వరకు తెగుళ్ల వల్ల పూత రావడంలేదని ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు గుర్తించారు. చెట్లను కాపాడుకునేందుకు సగటున ఏడాదికి 1.2 మిలియన్ టన్నుల పురుగుమందులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. పంటల సీజన్లో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ఉద్యానశాఖ అధికారులు మామిడి తోటలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. దీంతో రైతులే సొంతంగా ఎరువుల దుకాణదారులు చెప్పే మందులను వాడుతున్నారు. ఈ ఏడాది మామిడి పూత ఆలస్యమైన నేపథ్యంలో దిగుబడులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే వినియోగదారులకు నాణ్యమైన మామిడి దొరికే అవకాశం లేకపోగా.. ధరలు కూడా భారీగా ఉంటాయని పేర్కొంటున్నారు.
