హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శవంతుడు అని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కొనియాడారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పేదల సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచి, అమలు చేశారని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.1,000, రూ.2,000 పింఛనును లబ్ధిదారులకు సకాలంలో అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు.
ఏపీలో ఇటీవల అధికారం చేపట్టిన చంద్రబాబు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏప్రిల్ నుంచి పెన్షన్లను అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని, సీఎం రేవంత్‌రెడ్డి కూడా తన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పెన్షన్లను తక్షణమే పెంచి, డిసెంబర్ నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళల హక్కుల పరిరక్షణకు ఎమ్మార్పీఎస్ 17 ఏండ్లుగా ఉద్యమం చేస్తున్నదని తెలిపారు. వారి సంక్షేమానికి అడ్డుపడే ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలదీస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పెన్షన్‌దారులకు రేవంత్ సర్కారు 7 నెలలకు గానూ రూ.6,223 కోట్లు బాకీ పడిందని మందకృష్ణ తెలిపారు. ఆ డబ్బుతోనే రైతు రుణమాఫీ చేయాలని ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అన్నిరకాల పింఛన్లపై ప్రతి నెల రూ.889 కోట్లు అవుతుందని, ఆ లెక్కన లబ్ధిదారులకు రూ.6,223 కోట్లు అందాలని వివరించారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామని తేల్చిచెప్పారు.
రుణమాఫీ అమలు కోసం తర్జనభర్జన పడుతున్న రేవంత్ సర్కార్.. ఇతర శాఖల నిధులను మళ్లించి రుణమాఫీ అమలు చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ఉన్నోన్ని కొట్టి లేనోనికి పంచాల్సిన ప్రభుత్వం.. లేనోన్ని కొట్టి భూములు, జాగాలు ఉన్న ఉన్నోడికి రుణమాఫీ రూపంలో పంచాలనుకుంటున్నదని ఆరోపించారు. దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినంత హడావుడి చేసి వ్యవసాయశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కట్టబెట్టి రేవంత్ దగా చేశారని మండిపడ్డారు. ఈ నెల 25న దివ్యాంగుల పోరాట హక్కుల సంఘాలతో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పటి నుంచే పెంచిన పెన్షన్లతో బకాయిల విడుదల కోసం ఉద్యమ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.