ఖైరతాబాద్, డిసెంబర్ 2 : వర్గీకరణను అడ్డుకుంటామని, అమలు కానివ్వబోమని మాట్లాడేవాళ్లంతా సైకోలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాల సామాజికవర్గంలో మనువాదుల సంఖ్య భారీగా పెరిగిందని, వారే వర్గీకరణను అడ్డుకుంటామంటున్నారని, మనువాదుల వన్ సైడ్ లవ్ వర్గీకరణ విషయంలో పనికి రాదని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన ఓ సభలో వర్గీకరణను అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్‌లో ఉన్న మాల సామాజికవర్గ నాయకులు వ్యాఖ్యలు చేశారని, ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సభ సాక్షిగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేద్కర్ పక్కన బాబు జగ్జీవన్‌రాం ఫొటో పెట్టడానికి ఇష్టపడని ఆ సామాజికవర్గ నేతలు, సభా వేదికపై ప్రధాన వక్తగా వ్యవహరించిన వ్యక్తి తన తండ్రి ఫొటోను పెద్దగా పెట్టి, రాజ్యాంగ నిర్మాత ఫొటోను చిన్నగా పె ట్టారని విమర్శించారు. అంబేద్కర్‌కు ఇచ్చే గౌ రవం ఇదేనా? అని ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ధైర్యంగా వ్యతిరేకించే పార్టీలే లేవని, అన్ని పార్టీలూ సమర్థిస్తున్నాయని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతకు విఘాతమని చెప్పే ఆ నేత తండ్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడని, ఆయన కొడుకు కూడా ఆ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోరుకున్న పార్టీ కూడా కాంగ్రెసేనని, 1975లోనే పంజాబ్‌లో కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం జైల్ సింగ్ వర్గీకరణ అమలు చేశారని గుర్తుచేశారు.
2018లో రాహుల్‌గాంధీ హామీ
2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే వర్గీకరణ అమలు చేస్తామని స్వయంగా ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని మందకృష్ణ తెలిపారు. ఇటీవల ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే చేవెళ్ల డిక్లరేషన్‌లో వర్గీకరణ అమలుపై హామీ ఇచ్చారని, ఆగస్టు 1న సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు అనంతరం మొదటగా తెలంగాణలో అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటిస్తే అదే వర్గీకరణను అడ్డుకుంటామని ఆ పార్టీలో ఉండి ఎలా అంటారని ప్రశ్నించారు.
నీ ఒంటి మీద 3 కండువాలు మారినయ్
వర్గీకరణకు మాయవతి వ్యతిరేకంగా ఉ న్నారని చెప్పే బదులు ఆమె పార్టీలో చేరి వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకోవాలని మందకృష్ణ దుయ్యబట్టారు. ‘30 ఏండ్లుగా నా ఒంటిపై నల్లకండువా మారలేదు.. కానీ నీ ఒంటిపై మూడు కండువాలు మారినయ్’ అని సదరు నేతను ఉద్దేశించి ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌లో ఉన్న ఆ నేత తర్వాత బీఆర్ఎస్ లో చేరాడని, వర్గీకరణకు పార్టీ అధినేత కేసీఆర్ అనుకూలంగా స్వయంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి త్వరగా వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి కూడా చేశారని గుర్తుచేశారు. ‘నువ్వు కండువాలు మార్చిన 3 పార్టీలు వర్గీకరణకు అనుకూలమే.. ఏ పార్టీ లో ఉంటావో తేల్చుకో’ అంటూ సవాల్ చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం మౌనం వీడాలి
కాంగ్రెస్‌లో ఉండి, పదవులను అనుభవి స్తూ ఆ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోతు న్న ఆ నేతలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్య లు తీసుకుంటుందో చెప్పాలని, ఈ అంశంపై మౌనం వీడాలని డిమాండ్ చేశారు.
జనవరి 5న మాదిగ విద్యార్థి గర్జన సభ
జనవరి 5న ఓయూలో మాదిగ విద్యార్థి గర్జనసభ నిర్వహించనున్నట్టు విద్యార్థి నాయకులు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు.