నెన్నెల, మే 20: కాంటా పెట్టి 15 రోజులైనా ధాన్యాన్ని గోదాముకు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతం మేడం.. లారీలు పంపండి’ అంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు.
ఇందుకు ఆమె స్పందిస్తూ..‘నా కాళ్లు కాదు.. వెళ్లి కలెక్టర్ సారు కాళ్లు’ మొక్కండి’ అనడంతో రైతులు ఆమెపై మండిపడ్డారు. కాళ్లు మొక్కితేనే లారీలు పంపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం నెన్నెల మండ లం గొల్లపల్లి కేంద్రం వద్ద లారీల కోసం రైతులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడికి వచ్చిన ఆర్ఐ సులోచనను రైతులు ప్రాధేయపడ్డారు. ‘నా కాళ్లు కాదు.. సార్ కాళ్లు మొక్కండి’ అంటూ బదులిచ్చిన మాటలను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయడంతో వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు వేల బస్తాల వడ్లను కాంటా వేసినా, కేవలం రెండు లారీల బస్తాలనే మిల్లులకు తరలించారని మండిపడ్డారు. మిగతా బస్తాలను తరలించేందుకు లారీలు రావడం లేదని, వర్షాలకు వడ్లు తడిస్తే ఎవరు బాధ్యులను ప్రశ్నించారు.