వికారాబాద్, నవంబర్ 1: మణప్పురంలో బంగారం ఎత్తికెళ్లిన మేనేజర్‌ను పట్టుకున్నట్టు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వికారాబాద్ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా పనిచేసే విశాల్ 20మంది కస్టమర్లపైన 63 నకిలీ ఇన్వెంటరీ ఐడీలు సృష్టించి రూ.1.24కోట్లు బ్రాంచ్ నుంచి కాజేశాడు. ఉన్నతాధికారులు ఆడిట్‌కు వచ్చే సమయంలో సరిపడా బంగారాన్ని పెట్టేవాడు. అలా నకిలీ ఐడీలతో డబ్బులు తీసుకొని కోట్లు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్‌లో పెట్టడంతోపాటు సొంతానికి వాడుకున్నాడు. కస్టమర్లు కుదువ పెట్టిన బంగారం ప్యాకెట్ల నుంచి ఐదింటిని దొంగతనం చేసి పారిపోగా నిందితుడిని కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా నారాయణపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఐదు ప్యాకెట్లలోని 83గ్రాముల బంగారం, రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన వారితోపాటు ఆడిట్, విజిలెన్స్ టీమ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. కేసును చేధించిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య, టౌన్ సీఐ భీమ్ కుమార్, ధారూరు సీఐ రఘురాములు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.