సిద్ధమవుతున్న మన ఊరు-మన బడి అంచనాలు
3,679 బడుల్లో 12వేల పనులు రెడీ
30 లక్షలు దాటితే టెండర్లు.. వారంలో సిద్ధం
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలను కొత్త పుంతలు తొక్కించే ‘మన ఊరు-మన బడి’ పథకం పనులకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. తొలుత రూ.30 లక్షల లోపు ఖర్చయ్యే పనులను చేపడుతున్నారు. ఇప్పటివరకు 3,679 బడుల్లో 12 వేల పైచిలుకు పనులకు అంచనాలు రెడీ అయ్యాయి. వీటికి రూ.561 కోట్ల వ్యయమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు వేశారు. మార్చి 8న మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ వనపర్తిలో ప్రారంభించారు. ఈ పథకం అమలుకు ఇంజినీరింగ్ విభాగాలను ఎంపిక చేశారు.
రాష్ట్రంలో 594 మండలాలుండగా, 10 ఇంజినీరింగ్ విభాగాలకు పనుల బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం జిల్లాకు కోటి చొప్పున ఇప్పటికే నిధులు మంజూరుచేసింది. మొత్తం 2,415 పనులకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ) అనుమతులిచ్చారు. మరో 2,328 పనులకు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ) ఓకే చెప్పారు. వీటికి పరిపాలనపర అనుమతులు రావాల్సి ఉన్నది. తర్వాత సాంకేతిక అనుమతులిస్తారు. ఇంజినీరింగ్ విభాగాలు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో ఎంవోయూ కుదుర్చుకోవాలి. అనంతరం పనులను ప్రారంభిస్తారు.
మిగతావాటికి టెండర్లు..
రూ.30 లక్షలలోపు వ్యయం అయ్యే పనులను టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న, భారీ మరమ్మతులు, విద్యుత్తు కనెక్షన్లు, తాగునీటి వసతి, టాయిలెట్ల నిర్మాణం, కిచెన్‌షెడ్ల నిర్మాణం, ప్రహరీల నిర్మాణాలను టెండర్లు లేకుండానే చేపడుతారు. డ్యూయల్ డెస్క్ బల్లలు, డిజిటల్ / స్మార్ట్క్లాస్రూం పరికరాలు, పేయింట్స్, గ్రీన్ చాక్‌పీస్ బోర్డులు, హెచ్ఎం, స్టాఫ్‌రూం ఫర్నీచర్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌ల ఫర్నీచర్‌ను టెండర్ల ద్వారా సేకరిస్తారు. వారం రోజుల్లో ఈ పనుల అంచనాలను సిద్ధంచేసి, టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.