మహబూబాబాద్ రూరల్, నవంబర్ 3: మహబూబాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలో బతికుండగానే మార్చురీకి తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారంరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వెల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కాలు విరగడంతో ఏడాదిగా ఖాళీగా ఉన్నాడు. రాజు మద్యానికి బానిస కావడంతో అతడి భార్య..పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది.
రాజుకు టీబీ, కిడ్నీ, లివర్ సమస్యలతో వారం క్రితం మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు రాగా వైద్యులు చికిత్స అందించకపోవడంతో అక్కడే పడిపోయి ఉన్నాడు. అతడు చనిపోయాడని భావించిన సిబ్బంది మార్చురీకి తరలించారు. అతడి కదలికలను స్వీపర్ గుర్తించడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి రాజు మృతి చెందగా అతడి బంధువులకు వైద్యులు సమాచారం అందించారు.