కరీంనగర్ : తమ ఇంటి పరిసరాల్లో క్రికెట్ ఆడుతున్న యువకులకు ఓ యజమాని చుక్కలు చూపించాడు. ఆ ప్రాంతంలో ఓ పాము సంచరిస్తున్నట్లు ఓ వీడియోను సృష్టించి, అటు వైపు రావాలంటేనే భయపడేటట్లు చేశాడు.
రామడుగు మండలంలోని వెలిచాల గ్రామానికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్ నివాసం వద్ద ఖాళీ స్థలం ఉంది. దీంతో అక్కడికి పిల్లలు క్రికెట్ ఆడేందుకు ప్రతి రోజూ వస్తున్నారు. అయితే పిల్లలు క్రికెట్ ఆడటంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక్కడ క్రికెట్ ఆడొద్దని ఆ యువకులను హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్‌కు ఓ ఆలోచన వచ్చింది. అదేంటంటే.. ఆ ప్రాంతంలో పాము సంచరిస్తున్నట్లు ఓ వీడియో సృష్టించాడు. ఓ యాప్ నుంచి పాము వీడియోను డౌన్లోడ్ చేసి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అక్కడికి పిల్లలు వచ్చేందుకు భయపడ్డారు. ఆ వీడియో పోలీసుల దాకా చేరింది. వారు విచారణ చేయగా, అక్కడ పాము లేదని, యువకులను నివారించేందుకు అలా చేయాల్సి వచ్చిందని తేలింది.