శంషాబాద్ రూరల్, జూన్ 15: విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్టుచేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి శనివారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన రాజేశ్‌సింగ్ కపూర్ జల్సాలకు అలవాటుపడి విమానాల్లో తిరుగుతూ సంపన్న కుటుంబాల మహిళలను టార్గెట్ చేసేవాడు. సదరు మహిళలు బ్యాగులను క్యాబిన్లో భద్రపరిచే సమయంలో తన బ్యాగును కూడా దొంగ అక్కడే పెట్టేవాడు.
వారు వాష్‌రూంకు వెళ్లిన సమయంతో తన బ్యాగులో వస్తువులు తీసుకుంటున్నట్టు నటిస్తూ మహిళల బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను తీసుకొని బ్యాగులో వేసుకొనేవాడు. ఇలా దోచుకున్న ఆభరణాలను బంగారం దుకాణాదారులకు అమ్ముతుండేవాడు. రాజేశ్‌సింగ్ హైదరాబాద్-బెంగళూరు. బెంగళూరు-ఢిల్లీ, ముంబై-ఢిల్లీ ఇలా కనెక్టివిటీ విమానాల్లో అధికంగా ప్రయాణం చేసి దాదాపు కిలోకుపైగా బంగారం ఆభరణాలు దోచుకున్నాడు. 110 రోజుల్లోనే 200 సార్లు విమానాల్లో ప్రయాణించిన ఈ ఘరానా దొంగపై బాధిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీపుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఇతడికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. రాజేశ్సింగ్పై పదికిపైగా కేసులు ఉన్నాయి. ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌తోపాటు రాచకొండ కమిషరేట్ పరిధిలో కూడా ఇతడిపై కేసులు ఉన్నాయి.