Shamshabad | విమానాల్లో తిరుగుతూ మహిళల నుంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తున్న దొంగను ఆర్జీఐ పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి నుంచి కిలో వరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ప్రెస్మీట్లో వివరాలను వెల్లడించారు. ఢిల్లీకి చెందిన రాజేశ్ సింగ్ కపూర్ అనే వ్యక్తి జల్సాలకు అలవాటుపడి దొంగతనాలను మొదలుపెట్టారు. దాదాపు 110 రోజుల్లో 200 సార్లు విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడ్డాడు. కనెక్టివిటీ విమానాల్లో ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలను తస్కరిస్తున్నట్లుగా గుర్తించారు.
విమానం ఎక్కిన తర్వాత ఆ ఒంటరి మహిళ పక్కనే తన వెంబడి తీసుకువెళ్లే బ్యాగును విమానంలో సదరు మహిళ పక్కనే క్యాబిన్లో భద్రపరిచిన బ్యాగుల పక్కనే సదరు నిందితుడు బ్యాక్ పెడుతూ.. వాష్ రూమ్‌కు వెళ్లిన సందర్భంలో ఆయా మహిళల బ్యాంకులో నుంచి విలువైన ఆభరణాలను తీసుకొని తన బ్యాకులో వేసుకుంటూ వచ్చేవాడు. విమానం దిగి బయటకు వచ్చాక ఆ ఆభరణాలను పాన్ బ్రోకర్లకు విక్రయిస్తుండేవాడని డీసీపీ తెలిపారు. ఆర్జీఐ పోలీస్‌స్టేషన్‌తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిందితుడిపై పదికిపైగా కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.
నిందితుడు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీసీపీ వివరించారు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. నిందితుడి నుంచి దాదాపు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే, విమానాల్లో ప్రయాణించే సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని.. ఏవైనా విలువైన వస్తువులు ఉంటే బ్యాగులను తమ వెంటనే ఉంచుకోవాలని సూచించారు.