హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్లో తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. నిరూస్ సర్కిల్ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఇస్మాయిల్ అనే వ్యక్తిని ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ముజీబ్ బైక్పై అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇస్మాయిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. క్షతగాత్రుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థిరాస్తి గొడవల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఘటనా స్థలంలో మొత్తం ఐదుగురు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇస్మాయిల్, ముజీబ్ సహా మిగతా వారంతా పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.