IG Satyanarayana : నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool district) లోని ఊర్కొండపేట (Urkondapeta) కు దైవదర్శనం కోసం వచ్చిన మహిళను మూడు గంటలపాటు హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అత్యాచార ఘటనాస్థలిని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ (IG Satyanarayana) మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన కేసుకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. మహిళను మూడు గంటలపాటు హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడటం అమానుషమని ఐజీ అన్నారు. ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మహిళ ఒంటరిగా రావడాన్ని నిందితులు అదునుగా తీసుకున్నారని, వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఐజీ అన్నారు.
అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపిస్తామని ఐజీ చెప్పారు. నిందితులపై గతంలో కూడా బెదిరించి దోపిడీలకు పాల్పడినట్లు కేసులున్నాయని తెలిపారు. పార్కులకు వచ్చే మైనర్లను బెదిరించి డబ్బులు లాక్కునేవారని దర్యాప్తులో తెలిసిందని అన్నారు. ఎవరెవరి వద్ద నుంచి నిందితులు డబ్బులు లాక్కున్నారనే వివరాలను కూడా సేకరిస్తామని చెప్పారు. జాతరలు జరిగే ఆలయాల వద్ద గస్తీ పెంచుతామని ఐజీ తెలిపారు.